బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలను వేస్తే కఠినమైన శిక్షలు

by velandi.Saikiran |

క్యూర్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలను పడేస్తే కఠిన చర్యలు తప్పవని జయేష్ రంజన్ హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలను వేస్తే కఠినమైన శిక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలను పడేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ పరిపాలన, అర్బన్ డవలప్ మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ హెచ్చరించారు. హైదరాబాద్ నగర సుందరీకరణ కోసం ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంటే, మరోవైపు నగరం చుట్టూరా పేరుకుపోతున్న నిర్మాణ వ్యర్థాలతో అభివృద్ధికి అడ్డం పడుతోందని అన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఇస్కీ)లో కనస్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ ఛాలెంజెస్ పై శుక్రవారం జరిగిన వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. నగరానికి 160 కిలోమీటర్ల చుట్టూరా వున్న వున్న ఔటర్ రింగ్ రోడ్ తో పాటుగా అంతే దూరం గల సర్వీస్ రోడ్ వెంబడి కూడా నిర్మాణ వ్యర్థాలతో నగరం దుర్గంధంగా తయారయిందని, ఇటీవల జరిగిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో గమనించినప్పుడు నగరంలోని సుమారు 60 నుండి 80 చెరువులలో నిర్మాణ వ్యర్థాలను వేస్తూ వాటిని కూడా పూడ్చి వేస్తున్న తీరును చూస్తుంటే తన హృదయం బాధతో బరువెక్కిందన్నారు.

నిర్మాణ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడవేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని, నగర అందాన్ని నాశనం చేస్తున్న వారు ఇందుకు సిగ్గు పడాలన్నారు. ఐకియా సమీపంలోని నిర్మాణ వ్యర్థాల కొండను తొలగించాలంటే ప్రభుత్వానికి 80 నుండి వంద కోట్ల ఖర్చు అవుతుందని, ఇందుకు ఎవరు బాధ్యులన్నారు. ఒకప్పటి అందమైన హైదరాబాద్ నగరం ఈరోజు ఇండోర్, జబల్ పూర్, లక్నో, చెన్నయ్ నగరాల వెనకాల ఉందన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 626 ప్రకారంగా నిర్మాణ వ్యర్థాలను నిర్లక్ష్యం చేసేవారికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వేస్ట్ ప్రాసెస్సింగ్ ప్లాంట్లకు ఈ నిర్మాణ వ్యర్థాలను తరలించినపుడు, రీసైక్లింగ్ తో మరొక అందమైన మెటీరియల్ వస్తుందని, ఆ మెటిరియల్ ను వినియోగించుకోవాలని బిల్డర్స్ కు సూచించారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఇస్కీ), తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీజీపీసీబీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రెటరీ జి.రవి మాట్లాడుతూ నగరంలో రోజుకు సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని, రోజు ఉత్పత్తి అయ్యే ఏడు వేల టన్నుల చెత్తకు ఇది అదనమన్నారు. వాతావరణ కాలుష్యాన్ని చేస్తున్న అనేక పరిశ్రమలపై తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జీఓ నెం.626 గురించి అయన విపులంగా వివరించారు.

నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణను నిర్ధారించడానికి, రీసైక్లింగ్, పునర్వినియోగం ద్వారా వలయాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి పట్టణ స్థానిక సంస్థలు, అభివృద్ధి సంస్థలు, కాలుష్య నియంత్రణ బోర్డులు మరియు నిర్మాణ రంగం మధ్య సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఈ సాంకేతిక సమావేశాలలో సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2025 కింద నియంత్రణ చట్రం, వాటాదారుల బాధ్యతలు, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతలు, సీపీసీబీ ఆన్‌లైన్ పోర్టల్ సంసిద్ధత, పట్టణ స్థానిక సంస్థల ద్వారా అమలు వ్యూహాలు, రీసైక్లింగ్ సాంకేతికతలు, నిబంధనలపై చర్చించామని తెలిపారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (సీ అండ్ డీ వ్యర్థాల) శాస్త్రీయ సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు వినియోగాన్ని నిర్ధారించడంలో అవగాహన కల్పించారు. నగర స్థాయి కార్యాచరణ ప్రణాళికల తయారీ, సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేయడం, కొనసాగుతున్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలలో సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణను ఏకీకృతం చేయడంపై ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్ చర్చ దృష్టి సారించిందని చెప్పారు.

ఇస్కీ డైరెక్టర్ కల్నల్ హర్ పాల్ సింగ్ గ్రేవల్ మాట్లాడుతూ నగరాలూ నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్నాయని కాంక్రీట్, మట్టి, స్టీల్, చెక్క, ఇటుకలతోపాటుగా ప్లాస్టిక్ వేస్టేజ్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, గుట్టల్లాగా పేరుకుపోయి కాలుష్యాన్ని పెంచడం పెంచడం జరుగుతుందన్నారు. రీ సైక్లింగ్ ప్లాంట్స్ ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని గ్రేవల్ ప్రజలను కోరారు. ఈ వర్క్ షాపులో ఎంఎంసీ అడిషనల్ కమిషనర్(హెల్త్ అండ్ శానిటేషన్) రఘుప్రసాద్, సీఎంసీ అడిషనల్ కమిషనర్(హెల్త్ అండ్ శానిటేషన్) వేణుగోపాల్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, రీసస్టైనబిలిటీ ప్రతినిధి నిలేష్ గుప్తా, ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రతినిధి రఘురామ్, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వినాయక్ కుమార్ వంటి ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు.

Next Story