బ్యారేజీల భవిష్యత్తుపై కేంద్రానికి లేఖ రాయాలి

by velandi.Saikiran |

ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ సూచనల ప్రకారం ఫ్రీ-ఫ్లో విధానంలోనే కొనసాగిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

బ్యారేజీల భవిష్యత్తుపై కేంద్రానికి లేఖ రాయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ సూచనల ప్రకారం ఫ్రీ-ఫ్లో విధానంలోనే కొనసాగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సెక్రెటేరియట్‌లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్యారేజీల్లో మళ్లీ నీటిని నిల్వ చేయాలా? పంపింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభించాలా? అనే అంశంపై ఏ నిర్ణయం తీసుకున్నా సంబంధిత సాంకేతిక సంస్థల లిఖితపూర్వక అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణ, నీటి నిల్వలు, పంపింగ్ కార్యకలాపాలపై స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థకు వెంటనే లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రానికి పంపే లేఖలో ఎన్‌డీఎస్‌ఏ నివేదికలోని కీలక సూచనలు, గత సాంకేతిక పరిశీలనలు, సంబంధిత ఆధారాలను జతచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు నీటి నిల్వలు, పంపింగ్ చేపట్టలేదో పూర్తి వివరాలతో వివరించాలని సూచించారు. అదే లేఖ ప్రతులను ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ ద్వారా జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు నేరుగా అందజేయాలని ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉన్న ఫ్రీ-ఫ్లో నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక సిఫార్సులపై స్పష్టత ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఎన్‌డీఎస్‌ఏ నివేదికలోని సంబంధిత భాగాలను యథాతథంగా అమలు చేయాలని.. కేంద్ర జల సంఘం నివేదికలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షలు, ఫొటోలు, రాఫ్ట్ ఫౌండేషన్ కింద గుర్తించిన ఖాళీలు (క్యావిటీలు), ఇతర ఇంజినీరింగ్ ఆధారాలను సైతం జతచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఎన్‌డీఎస్‌ఏ, కేంద్ర జల్ శక్తి శాఖ సూచించిన ప్రతి సాంకేతిక సిఫార్సును అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.

అన్నారం బ్యారేజీలోనూ రాఫ్ట్ ఫౌండేషన్ సమస్యలు

బ్యారేజీల పునరుద్ధరణపై జరుగుతున్న అధ్యయనాల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ తాజా జీపీఆర్ డేటా, ఇతర సాంకేతిక సమాచారం విశ్లేషణ చివరి దశలో ఉన్నదని తెలిపారు. అన్నారం బ్యారేజీ రాఫ్ట్ ఫౌండేషన్ కింద కూడా క్యావిటీలు ఉన్నట్లు గుర్తించినందున ప్రస్తుతం అక్కడ కూడా నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదని అధికారులు వివరించారు. అందుబాటులో ఉన్న పరిశోధనల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించిన కాన్సెప్ట్ డిజైన్ ఆగస్టు చివరి నాటికి సిద్ధమవుతుందని, ప్రాథమిక వ్యయ అంచనా సెప్టెంబర్ మధ్య నాటికి సిద్ధం చేస్తామని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను తదుపరి టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సమావేశంలో సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

పంపింగ్‌పై రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదు

కేవలం నీరు దిగువకు ప్రవహిస్తోందనే కారణంతో పంపింగ్ సాధ్యం కాదని అధికారులు మంత్రికి వివరించారు. అవసరమైన ఎగువ నీటి మట్టం ప్రస్తుతం లేకపోవడంతో పంపింగ్‌కు అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. తాత్కాలిక చర్యలతో పంపింగ్ చేపట్టడం ఫలితం ఇవ్వకపోగా, బ్యారేజీల నిర్మాణ భద్రతకు మరింత ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. దీనిపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిళ్ల ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ ఆధారాలు, సంబంధిత సాంకేతిక నిపుణుల సిఫార్సుల ఆధారంగానే తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే.. సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపైనా మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్ పరిధిలోని వివాదాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రస్తుతం డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story