- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఎలుగుబంటి మృతి.. ముగ్గురు అరెస్ట్..
విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, తల్లాడ: విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అటవీ అధికారుల కథనం ప్రకారం తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లోకారం రిజర్వ్ ఫారెస్ట్,లోకారం సౌత్ బీట్‌లో గురువారం (జూలై 23) ఒక ఎలుగుబంటి మృతి చెంది ఉండటాన్ని అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.విద్యుత్ తీగలు తగిలి మృతిచెందిన ఎలుగుబంటి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో వెదురు పొదల్లో దాచిన సుమారు 2.20 కిలోల బైండింగ్ వైర్ కాయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు పశువైద్యాధికారి చేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
అనుమానాస్పద కదలికలు కనిపిస్తే..
వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ లైన్లను అక్రమంగా ఉపయోగించడం వల్లే ఎలుగుబంటి కరెంట్ షాక్‌కు గురై మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఉమా చౌకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితులను శుక్రవారం సత్తుపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వన్యప్రాణుల రక్షణకు తమ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తల్లాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. విద్యుత్ లైన్ల ద్వారా వేట, విషప్రయోగం, ఉచ్చులు ఏర్పాటు చేయడం వంటి అక్రమ చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడవుల రక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.






