డెంటల్ డాక్టర్‌తో ‘సూపర్ స్పెషలిస్ట్’ వైద్యులకు శిక్షణ!

by Ajay Maddhiboyina |

సాధారణ డెంటల్ (బీడీఎస్) డాక్టర్‌తో... ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు పాఠాలు చెప్పిస్తున్న విస్తుపోయే ఘటన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) తనిఖీల్లో వెలుగుచూసింది.

డెంటల్ డాక్టర్‌తో ‘సూపర్ స్పెషలిస్ట్’ వైద్యులకు శిక్షణ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణ డెంటల్ (బీడీఎస్) డాక్టర్‌తో... ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు పాఠాలు చెప్పిస్తున్న విస్తుపోయే ఘటన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) తనిఖీల్లో వెలుగుచూసింది. సీనియర్ డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు బోధించాల్సిన అత్యంత క్లిష్టమైన ‘రీజెనరేటివ్ మెడిసిన్’ అంశాలపై, అర్హత లేని డెంటల్ డాక్టర్‌తో హ్యాండ్స్-ఆన్ శిక్షణ ఇప్పిస్తున్న వైనాన్ని అధికారులు రట్టు చేశారు. కర్మన్‌ఘాట్‌లోని హోటల్ శుభం ప్రెస్టీజ్ లో మ్యాక్ ఇంటర్నేషనల్ అకాడమీ, నాచురో స్కాలర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫెలోషిప్ ఇన్ సెల్యులార్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ (ఎఫ్సీఆర్ఎం) మూడు రోజుల శిక్షణా శిబిరంపై టీజీఎంసీ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది.

టీజీఎంసీ సభ్యులు డాక్టర్ గుండగాని శ్రీనివాస్, డా. జలగం విజయ్, కౌన్సిల్ విజిలెన్స్ అధికారి రాము ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. సీనియర్ డెర్మటాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులతో క్లాసులు ఉంటాయని నమ్మబలికిన నిర్వాహకులు.. తీరా మహారాష్ట్ర డెంటల్ కౌన్సిల్‌లో నమోదైన డెంటిస్ట్ డా. పృథ్వీ వైటీతో క్లిష్టమైన ప్రాసెస్ లపై శిక్షణ ఇప్పిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణకు చెందిన రేడియాలజిస్టులు, యూరాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు ఆయుష్ వైద్యులు సైతం డెంటల్ డాక్టర్ ఇచ్చే శిక్షణను వింటుండటం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

ఆర్థరైటిస్, బోన్స్ ప్రాబ్లమ్స్‌పైనా డెంటల్ క్లాసులు!

వైద్య నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్లు వివరించాల్సిన ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు (ఆర్థోపెడిక్ విభాగం), చర్మ సంబంధిత చికిత్సల విధానాలను డెంటల్ అర్హత మాత్రమే ఉన్న డాక్టర్ బోధించడమేంటని టీజీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెర్మటాలజిస్టులు పాఠాలు చెప్తారని భావించి వచ్చామని, తీరా అర్హత లేని వ్యక్తితో క్లాసులు చెప్పించి తమను తప్పుదారి పట్టించారని శిక్షణకు హాజరైన స్పెషలిస్ట్ డాక్టర్లు విస్మయం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తులతో స్పెషలిస్ట్ వైద్యులకు శిక్షణ ఇప్పిస్తూ ప్రజారోగ్యం, రోగుల భద్రతతో పాటు వైద్య నైతికతను ముప్పులోకి నెడుతున్న ఇటువంటి శిక్షణా కార్యక్రమాలపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ స్పష్టం చేసింది. తనిఖీ నివేదికను కౌన్సిల్ జనరల్ బాడీ ముందుకు తీసుకెళ్లడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన డెంటల్ ప్రాక్టీషనర్‌పై చర్యల కోసం తెలంగాణ, మహారాష్ట్ర డెంటల్ కౌన్సిళ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ కు వచ్చే ముందు ఎవరు శిక్షణ ఇస్తున్నారో, వారి అర్హతలేంటో తెలుసుకుని వైద్యులు రావాలని టీజీఎంసీ సభ్యులు డా. గుండగాని శ్రీనివాస్ సూచించారు.

Next Story