రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన భూదాన్ భూముల వివాదం..

by Kodari Anjali |

170 ఎకరాల భూదాన్ భూములపై నేడు విచారణ జరిగింది.

రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన భూదాన్ భూముల వివాదం..
X

దిశ, మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1057, 1154లో ఉన్న 170 ఎకరాల భూదాన్ భూముల వివాదంపై రాష్ట్ర ప్రధాన భూ పరిపాలనాధికారి (సీసీఎల్ఏ) మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం జరిగే విచారణకు మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యాలు, ఇద్దరు రైతులు, జిల్లా కలెక్టర్, మేళ్లచెరువు తహసీల్దార్ హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. సుమారు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూవివాదం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. 1965లో అక్కిరాజు వాసుదేవరావు కుటుంబం 170 ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా ఇచ్చింది. అనంతరం ఈ భూములను మైహోమ్, కీర్తి సిమెంట్ పరిశ్రమలు అక్రమంగా ఆక్రమించాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ అంశంపై లోకాయుక్తతో పాటు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగగా, భూములు భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందినవేనని పేర్కొంటూ పరిశ్రమల నుంచి వాటిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఈ భూములను ఖాళీ చేయించాలని సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, విచారణలు కొనసాగుతూ సమస్య పరిష్కారం కాలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ విచారణకు నోటీసులు జారీ కావడంతో ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి నోటీసుల్లో జిల్లా కలెక్టర్, మేళ్లచెరువు తహసీల్దార్‌ను కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పేర్కొనడం గమనార్హం. శనివారం జరిగే విచారణలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనే అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

Next Story