ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్..

by Kodari Anjali |

రూ.1.75 లక్షల విలువైన చోరీ కేసును బాన్స్వాడ రూరల్ సిఐ తిరుపయ్య శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్..
X

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ గ్రామ శివారులో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు గోల్ బంగ్లా సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఏకో టూరిజం కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన చోరీ కేసును బాన్స్వాడ రూరల్ సిఐ తిరుపయ్య శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. తిరుపయ్య శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాటేజీల్లో గతంలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి బానిసలై ఉద్యోగాలు కోల్పోయారు. తమను ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్‌పై కక్ష పెంచుకుని ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి సమయంలో మారుతి రిట్జ్ కారు (AP09CM6006)లో పటాన్‌చెరువు నుంచి అచ్చంపేట్‌కు చేరుకున్నారు. అనంతరం కాటేజీల్లో ఎవరూ లేని సమయంలో గదికి ఉన్న తాళాన్ని రాయితో పగులగొట్టి లోపలికి ప్రవేశించి రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక WUKO CLIPPER బాక్స్‌తో పాటు మొత్తం రూ.1.75 లక్షల విలువైన వస్తువులను చోరీ చేసి అదే కారులో తీసుకెళ్లారు.

నిందితుల వద్ద నుంచి...

ఈ ఘటనపై ఏకో టూరిజం కాటేజీ సూపర్‌వైజర్ అందె మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో, రూరల్ సీఐ ఎ. తిరుపయ్య నేతృత్వంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు, టెక్నికల్ డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులు భూపాలపల్లి జిల్లాకు చెందిన గట్టు రాకేష్ ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని లక్ష్మణ్ రావు అలియాస్ శివ సీఐ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక WUKO CLIPPER బాక్స్, మారుతి రిట్జ్ కారు (AP09CM6006) రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు రూ.1.75 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసి నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించి, చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేసిన బాన్సువాడ రూరల్ సీఐ ఎ. తిరుపయ్య, నిజాంసాగర్ ఎస్‌ఐ జె. శివకుమార్, టెక్నికల్ టీమ్‌తో పాటు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.

Next Story