NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిని తొలగించిన కేంద్రం

by Naga Rani Yarlagadda |

పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిని తొలగించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్ : పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు, విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు గాను ఎన్టీఏలో సంచలన ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా 47 మంది అధికారులను విధుల్లోంచి తొలగిస్తూ (Terminate) సంచలన నిర్ణయం తీసుకుంది. వీరిలో కొందరిపై చట్టపరమైన మరియు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ 'ఏఎన్ఐ' (ANI) వార్తా సంస్థ వెల్లడించింది.

ఔట్‌సోర్సింగ్ విధానంలో భారీ మార్పులు

గత కొన్ని నెలలుగా నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల నేపథ్యంతో పాటు భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం అనేక కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. పరీక్షల భద్రతను పెంచేందుకు ఎన్టీఏ ఉపయోగిస్తున్న ప్రస్తుత ఔట్‌సోర్సింగ్ నమూనాను పూర్తిగా సమీక్షించి, లీకేజీలకు తావులేకుండా మార్పులు చేయనున్నారు. పేపర్ లీకేజీ కేసుల్లో వేగంగా న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన NEET, JEE, CUET తో పాటు దాదాపు 20కి పైగా జాతీయ స్థాయి ప్రవేశ, నియామక పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఈ ప్రక్షాళన ద్వారా సంస్థలో పారదర్శకతను, భద్రతను పునరుద్ధరించవచ్చని కేంద్రం భావిస్తోంది.

Next Story