ఢిల్లీలో అల్లర్లకు కమ్యూనిస్టులే కారణం: బండి సంజయ్

by Gantepaka Srikanth |

నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆందోళనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు.

ఢిల్లీలో అల్లర్లకు కమ్యూనిస్టులే కారణం: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆందోళనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యార్థుల పక్షాన కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే, ఆందోళనల వెనుక ఉన్న అరాచక శక్తుల కుట్రలను ఎండగట్టారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై అందరికంటే ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోడీ బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీ సహా 17 మందిని అరెస్ట్ చేసిందని తేలిపారు. విద్యార్థుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినట్లు స్పష్టం చేశారు.

విద్యార్థుల ముసుగులో అరాచక శక్తులు..

మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు శక్తులు అరాచకాలకు సృష్టించాయని మంత్రి మండిపడ్డారు. ఈ శక్తులు ఏకంగా పార్లమెంట్‌పై దాడి చేసేందుకు కుట్ర చేశాయని, అందులో భాగంగానే దేశ వ్యతిరేక నినాదాలు చేశాయని ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ దాడుల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలై తలలు పగిలినా పోలీసులు సంయమనం పాటించి ఎక్కడా ఫైరింగ్ చేయలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే అరాచక శక్తులపై తప్పనిసరి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఢిల్లీ ఉద్రిక్తతల వెనుక విదేశీ కుట్ర ఉందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ దేశంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసిందని బండి సంజయ్ వెల్లడించారు.

Next Story