ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో దాడి.. కేంద్రంపై రెచ్చిపోయిన రాహుల్ గాంధీ

by Gantepaka Srikanth |

నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర భద్రతా దళాలు పెల్లెట్ గన్లు (Pellet guns), లాఠీఛార్జ్ ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా నిరసించారు.

ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో దాడి.. కేంద్రంపై రెచ్చిపోయిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర భద్రతా దళాలు పెల్లెట్ గన్లు (Pellet guns), లాఠీఛార్జ్ ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా నిరసించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిభావంతులైన విద్యార్థులపై పోలీసులు సాగించిన దమనకాండలో 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడని రాహుల్ తెలిపారు. “చేతిలో జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాహిల్ అనే విద్యార్థిపై పెల్లెట్ గన్‌తో కాల్పులు జరిపారు. ఆ పెల్లెట్ తగలడంతో అతని ఒక కన్ను తీవ్రంగా దెబ్బతిన్నది. మళ్లీ చూపు వస్తుందో లేదో కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారు అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ల గన్లు ఉపయోగించడం అత్యంత అరుదైన, దారుణమైన ఘటన అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ డిమాండ్లు..

బాధిత విద్యార్థుల తరఫున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ముందు మూడు స్పష్టమైన డిమాండ్లను ఉంచారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన అధికారులను వెంటనే విధుల్లోంచి తొలగించాలి. విద్యార్థులపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లతో దాడులకు తెగబడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై జరిగిన ఈ దమనకాండకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ యువతకు, విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకారం..

మరోవైపు, రాజ్యాంగ క్లబ్ (Constitution Club)లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ (CJP) ప్రతినిధులు దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం సీజేపీ జాతీయ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ రెండు కీలక డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. నీట్ లీకేజీ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1కోటి పరిహారం అందించడం, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవడం వంటి వారికి సూత్రప్రాయంగా అంగీకరించిందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లపై ఆలోచించడానికి ప్రభుత్వం సమయం కోరిందని, మలివిడత చర్చలు శనివారం జరగనున్నాయని సీజేపీ ప్రతినిధులు తెలిపారు.

Next Story