- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ నిలిపివేత.. ఢిల్లీ హైకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ ఆందోళనలు, తదనంతర పరిణామాలపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం రెండు కీలక పిటిషన్లు చర్చనీయాంశంగా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ ఆందోళనలు, తదనంతర పరిణామాలపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం రెండు కీలక పిటిషన్లు చర్చనీయాంశంగా మారాయి. నీట్ నిరసనలపై ఎన్‌ఐఏ విచారణ కోరిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించగా, జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ నిలిపివేతను సవాల్ చేస్తూ మరొక పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాలను పరిశీలించింది. జూలై 20న నిర్వహించిన 'సంసద్ చలో' మార్చ్ వెనుక విదేశీ నిధులు, రాజకీయ కుట్రలు ఉన్నాయని, దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేత విచారణ జరిపించాలని అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్‌ఐఏ చట్టం ప్రకారం కేసును బదిలీ చేయాలా వద్దా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కేంద్ర సంతృప్తికి బదులుగా కోర్టులు తమ అభిప్రాయాన్ని భర్తీ చేయలేవని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ కేవలం ఒక దర్యాప్తు సంస్థ (Investigation Agency) మాత్రమే తప్ప సాధారణ విచారణలకు వినియోగించేది కాదని పేర్కొంది. న్యాయస్థానం వైఖరిని గమనించిన పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా, హైకోర్టు దానికి అనుమతించింది.
జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్
మరొక వైపు, జంతర్ మంతర్ ప్రాంతంలో విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసనల నేపథ్యంలో.. అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ (Internet Shutdown) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 'సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్, ఇండియా' (SFLC.in) హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ (PIL) దాఖలు చేసింది. ఇంటర్నెట్ బంద్ విధించడం ఆర్టికల్ 19(1)(a) కింద పౌరులకు లభించిన భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023, తాత్కాలిక సేవల నిలిపివేత నిబంధనలు-2024ను కేంద్రం పాటించలేదని ఆరోపించారు. 'అనురాధ బాసిన్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్నెట్ రద్దు ఉత్తర్వులను బహిరంగంగా ప్రచురించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం రహస్యంగా అమలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధాన డిమాండ్లు..
జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో విధించిన ఇంటర్నెట్ నిలిపివేత ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి. ఇంటర్నెట్ రద్దుకు సంబంధించిన అసలు రికార్డులు, ఇంటెలిజెన్స్ నివేదికలను కోర్టుకు సమర్పించాలి. భవిష్యత్తులో ఇంటర్నెట్ రద్దు ఉత్తర్వులను అమలు చేయడానికి ముందే లేదా అమలుతో పాటు బహిరంగంగా ప్రచురించేలా ఆదేశాలు జారీ చేయాలి.






