సీజేపీ ప్రతినిధులతో ముగిసిన కేంద్రం చర్చలు.. రాజీనామాకే పట్టు!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-24 09:31:24  IST  )

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్’ (NEET) పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలో సంస్కరణల వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులకు మధ్య జరిగిన కీలక చర్చలు ముగిశాయి.

సీజేపీ ప్రతినిధులతో ముగిసిన కేంద్రం చర్చలు.. రాజీనామాకే పట్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్’ (NEET) పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలో సంస్కరణల వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులకు మధ్య జరిగిన కీలక చర్చలు ముగిశాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ (Constitution Club) వేదికగా సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీ అత్యంత ఉత్కంఠ వాతావరణంలో సాగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రులు, సీజేపీ ప్రతినిధులు కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి బయటకు వెళ్లారు.

ప్రభుత్వానికి సీజేపీ లిఖితపూర్వక ప్రతిపాదనలు

ఈ చర్చల్లో ప్రభుత్వం తరఫున కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ హాజరవ్వగా.. సీజేపీ తరఫున సీనియర్ ప్రతినిధి సౌరవ్ దాస్ నాయకత్వంలోని బృందం పాల్గొన్నారు. చర్చల సందర్భంగా నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న పలు లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు సీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనలను (Written Memorandum) సమర్పించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ పట్టు!

ఈ సమావేశంలో సీజేపీ ప్రధానంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ తీవ్రంగా పట్టుబట్టింది. బాధిత విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, విద్యాశాఖలో పారదర్శకత పెంచేలా సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకూడదని డిమాండ్ చేశారు. సీజేపీ సమర్పించిన ప్రతిపాదనలపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.. ఈ అంశాలను ఉన్నత స్థాయిలో చర్చించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. మంత్రి రాజీనామా డిమాండ్, ఇతర అంశాలపై స్పష్టమైన హామీ లభించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అధికారిక ప్రకటనపై ఆసక్తి

ఈ సమావేశంలో జరిగిన చర్చలపై కేంద్ర ప్రభుత్వం లేదా సీజేపీ తరఫున ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే విద్యా వ్యవస్థలో సంస్కరణలు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధించి మరిన్ని చర్చలు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నీట్ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

పేపర్ లీక్‌లపై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

Next Story