‘నీట్’ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. కేంద్రంతో పాటు NTAకు నోటీసులు

by Kema Shiva Kumar |

నీట్ (NEET-UG) సంస్కరణలపై కేంద్రం, ఎన్టీఏలకు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

‘నీట్’ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. కేంద్రంతో పాటు NTAకు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారం తర్వాత పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం‌తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలను అఫిడవిట్‌లో స్పష్టంగా వివరించాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా ప్రతిపాదిత గవర్నింగ్ బోర్డు, నిపుణుల కమిటీలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, భద్రత, పారదర్శకత, పరిశోధన-అభివృద్ధి, మానవ వనరులు సహా 10 ప్రధాన విభాగాల్లో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల అమలు వివరాలను కోర్టు కోరింది. పరీక్షల భద్రత, పర్యవేక్షణ, నిఘా కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్స్ (ADGs) పాత్ర, వారి పనితీరు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో, పరీక్ష తర్వాత ఇలా ప్రతీ దశలోనూ చేపట్టిన సంస్కరణలపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్‌ను ధర్మాసనం డిమాండ్ చేసింది.

రవాణా, సీబీటీ విధానం..

ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, రవాణా, బహుళ సెషన్ల పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు (CBT) మారే ప్రతిపాదనలతో పాటు డేటా భద్రతా చర్యలను కోర్టు కోరింది. ప్రశ్నాపత్రాల సురక్షిత రవాణాకు భారత వైమానిక దళాన్ని (IAF) ఉపయోగించడం కేవలం తాత్కాలిక చర్యేనని, ఇది శాశ్వత పరిష్కారం కాదని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల తనిఖీ కోసం ‘డిజియాత్ర’ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని కోరింది.

అయితే, గత అఫిడవిట్‌లో ఈ విషయాలు సరిగ్గా లేవని కోర్టు వ్యాఖ్యానించగా, కొత్తగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. ‘మేం దీనిని ఏడాది పొడవునా నిశితంగా పర్యవేక్షిస్తాం.. సంస్థాగత మార్పులు వచ్చేలా చూస్తాం’ అని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Next Story