పార్వతీపురం మన్యానికి ‘కుంకీ’ ఏనుగులను పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-24 06:44:37  IST  )

మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సమస్యకు పరిష్కారంగా పలమనేరు నుంచి 'జయంత్, అభిమన్యు' కుంకీ ఏనుగుల తరలింపు; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు.

పార్వతీపురం మన్యానికి ‘కుంకీ’ ఏనుగులను పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల బెడద నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కీలక అడుగు పడింది. ఒడిశా సరిహద్దుల నుండి ప్రవేశించే అడవి ఏనుగుల గుంపుల వల్ల పంటలు, గ్రామాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, పలమనేరు ముసలమడుగు శిబిరం నుంచి శిక్షణ పొందిన 'జయంత్', 'అభిమన్యు' అనే రెండు కుంకీ ఏనుగులను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తున్నారు.

అమరావతి క్యాంప్ ఆఫీస్ వేదికగా ఈ కుంకీ ఏనుగుల తరలింపు, మన్యం ప్రాంతంలో చేపడుతున్న రక్షణ చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షించి, సంబంధిత అటవీ అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. మానవ-ఏనుగుల సంఘర్షణను అదుపు చేయడంలో ఈ రెండు కుంకీ ఏనుగులకు అత్యంత అనుభవం ఉందని అధికారులు వెల్లడించారు. తక్షణ ఉపశమనంగా ఈ కుంకీలను మోహరించడంతో పాటు, భవిష్యత్తులో సోలార్ కంచెల నిర్మాణం, ఏఐ (AI) ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, ‘హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్’ బృందాల ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Next Story