- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నో ఏళ్ల కల ఫలించనున్న వేళ.. రైతన్నల హర్షం
గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ రేవు వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి.

దిశ, గాంధారి: గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ రేవు వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా వంతెన కోసం ఎదురుచూసిన రైతుల కల సాకారమవుతుండటంతో ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రూ.4.90 కోట్లతో చకచకా నిర్మాణం..
గత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోచమ్మ రేవు పై బ్రిడ్జి నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు హామీ ఇచ్చారు. 4.90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. కేవలం నాలుగు నెలల్లోనే నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో శివారు ప్రాంత రైతులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. "మాట ఇచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టి, వేగంగా పూర్తి చేసిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ధన్యవాదాలు అని, ఇది మా జీవితకాల సమస్యకు పరిష్కారం" అని రైతులు అన్నారు.
వర్షాకాలంలో నరకం చూసిన రైతులు..
గతంలో వర్షాకాలం వచ్చిందంటే పోచమ్మ రేవు శివారు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. వాగు నిండుగా ప్రవహించినప్పుడు పొలాలకు వెళ్లలేకపోయేవారు. ఎరువులు, విత్తనాలు తీసుకుని వాగు దాటలేక నానా అవస్థలు పడేవారు. ఒకరిద్దరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటే ప్రయత్నాలు కూడా చేశారు. తప్పని పరిస్థితుల్లో గుర్జాల్ శివారు గుండా దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్లు చుట్టి తిరిగి పొలాలకు వెళ్లేవారు. అంత్యక్రియలకు సైతం మృతదేహాలను తీసుకెళ్లలేని పరిస్థితులు ఎదురయ్యేవి.
రైతుల జీవితాల్లో వెలుగు..
ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండటంతో రైతులకు, గ్రామస్తులకు పెద్ద ఊరట లభించింది. వ్యవసాయ పనులు సకాలంలో చేసుకునే అవకాశం, అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లే సౌకర్యం, అంత్యక్రియలకు ఇబ్బందులు లేకుండా పోయాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు చొరవతో ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త మార్గం ఏర్పడిందని రైతన్నలు కొనియాడారు.






