- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది భయపడే జనరేషన్ కాదు.. ధర్నా చౌక్‌లో KTR కీలక వ్యాఖ్యలు
నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా, ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర పోలీసుల అణచివేత ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా, ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర పోలీసుల అణచివేత ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం (BRSV) పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ (ధర్నా చౌక్) వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు భారీగా తరలివచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నల్ల చొక్కా ధరించి పాల్గొన్నారు. తన జన్మదిన వేడుకలను సైతం రద్దు చేసుకుని విద్యార్థుల హక్కుల కోసం నేరుగా ధర్నా స్థలానికి వచ్చి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల జులుం నశించాలని, యువతపై జరుగుతున్న దమనకాండను వెంటనే ఆపాలని నినాదాలు చేశారు.
ఇది భయపడే జనరేషన్ కాదు..
"ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. కళ్లలో నీళ్లొస్తున్నాయి. విద్యార్థులేమైనా మోడీ, అమిత్ షాల కుర్చీలు అడిగారా? లేక రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని అప్పగించమన్నారా? కేవలం తమకు జరిగిన అన్యాయంపై శాంతియుతంగా న్యాయం మాత్రమే అడిగారు" అని ప్రశ్నించారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హితవు పలికారు. ఇది భయపడే జనరేషన్ కాదు.. పాలకులను భయపెట్టే జనరేషన్ అని సూచించారు. ఇటీవల యువతతో పెట్టుకున్న నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలా కుప్పకూలాయో కేంద్రం గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు. గతంలో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా విద్యార్థుల కోసం కేంద్ర అరాచకాలను గట్టిగా ఎండగడతామని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా యువత కదం తొక్కుతోందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. తాము కేంద్ర విధానాలను ఎండగట్టేందుకు ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుందని ప్రశ్నించారు. తమ ధర్నాకు యూత్ కాంగ్రెస్ అడ్డురావడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.






