ఆర్టీసీ బస్సులో యువతి ఛాతీపై చెయ్యివేసి అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-01 05:06:15  IST  )

నా పక్కన ఖాళీగా ఉన్న సీటులో ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. నిద్రపోగా.. కళ్లు తెరిచి చూసేసరికి అతని చెయ్యి నా ఛాతీపై ఉంది.

ఆర్టీసీ బస్సులో యువతి ఛాతీపై చెయ్యివేసి అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బస్సుల్లో అమ్మాయిలను టీజ్ చేయడం అబ్బాయిలకు పరిపాటిగా మారింది. అలాంటి ఆకతాయిలకు ఎదురుతిరిగి సరైన రీతిలో బుద్ధి చెప్తే ఎలా ఉంటుందో చేసి చూపించిందో యువతి. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో తనపట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించడాన్ని వీడియో తీసిన యువతి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు.. పోలీసులను ట్యాగ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. యువతి ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

నా ఛాతీపై అతని చెయ్యి.. భయంతో వణికిపోయాను

వీడియోలో మాట్లాడిన యువతి.. తాను తన సోదరుడితో కలిసి బస్సులో అంకోలాకు ప్రయాణిస్తున్నానని తెలిపింది. తన సోదరుడికి విండో సీట్ కావడంతో తాము మూడుసీట్ల వరుసలో కూర్చోగా.. తన పక్కన ఖాళీగా ఉన్న సీటులో 28 ఏళ్ల యువకుడు వచ్చి కూర్చొన్నట్లు వివరించింది. ఆర్టీసీ బస్సు కావడంతో అతన్ని వేరే సీటులో కూర్చోమని అడగలేకపోయానని తెలిపింది. ఇంతలో తనకు నిద్ర రాగా.. కాసేపటికి కళ్లు తెరిచి చూసేసరికి అతని చెయ్యి తన ఛాతీపై ఉందని, అది చూసి తాను భయంతో వణికిపోయానని చెప్పింది.

ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యా

మొదట భయపడినా.. ఆ తర్వాత అతన్ని వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యానని చెప్పింది. వెంటనే బస్సుల్లోకి ఇలాంటి పనులు చేసేందుకే వస్తారా ? అని గట్టిగా ప్రశ్నించినా అతను సైలెంట్ గానే కూర్చొన్నాడు. మళ్లీ గట్టిగా అరిచి సీటులోంచి పక్కకు తోసేయగా.. బస్సు ఆగగానే దిగిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే వీడియో తీస్తూ.. అతని తలపై ఒకటి కొట్టగా.. తనకేం తెలియదని, తానేం చేయలేదని బుకాయించడం స్టార్ట్ చేశాడు. అతని తండ్రి, అక్క చెల్లెళ్లకు కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఘటనలకు అమ్మాయిలెవరూ భయపడవద్దని యువతి వీడియోలో కోరింది. మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకోసం మీరు ధైర్యంగా నిలబడాలని సూచించింది. ఈ ఘటనపై అంకోలా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎంఎన్ దీపన్ తెలిపారు.

Next Story