- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI: ఏఐ యుగంలో కొత్త స్టార్ జాబ్
విప్రో, హెచ్‌సీఎల్ టెక్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజాలు సైతం ఈ మల్టీ-స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణతో భారత ఐటీ సేవల రంగం రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రాడక్ట్ మేనేజర్ల కోసం వేచి చూసే పాతకాలపు బ్యాక్-ఆఫీస్ కోడర్ల స్థానంలో.. కోడింగ్, బిజినెస్ వ్యూహం, క్లయింట్ డెలివరీ నైపుణ్యాలు కలిగిన 'ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్ల (ఎఫ్‌డీఈ)' వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ తన మొత్తం ఉద్యోగుల్లో కనీసం 6,000 మందిని ఎఫ్‌డీఈలుగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) ఏకంగా ఏఐ సిస్టమ్‌ల అమలు కోసం ఈ ఇంజనీరింగ్ విభాగంలో బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజాలు సైతం ఈ మల్టీ-స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
కోట్లలో వేతనాలు
ప్రస్తుతం దేశంలో ఎంటర్‌ప్రైజ్ లెవెల్ ఏఐ అమలు పెరిగినప్పటికీ, దానికి తగిన ఎఫ్‌డీఈ ప్రొఫెషనల్స్ సంఖ్య కేవలం 1,500 లోపే ఉండటం వీరికి విపరీతమైన డిమాండ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఉన్న 12,000 పైచిలుకు క్లౌడ్, ఏపీఐ, బ్యాకెండ్ డెవలపర్లకు అంతర్గతంగా ఏఐ-నేటివ్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తూ ఎఫ్‌డీఈలుగా మారుస్తున్నాయి. ఇక జీతాల విషయానికొస్తే, ఎంట్రీ-లెవెల్ ఎఫ్‌డీఈలకు రూ. 18-28 లక్షలు లభిస్తుండగా, మిడ్-లెవెల్ నిపుణులు రూ. 30-50 లక్షలు సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ ఏఐ సంస్థల్లో అనుభవజ్ఞులైన సీనియర్ ఎఫ్‌డీఈల వార్షిక వేతనాలు రూ. 65 లక్షల నుంచి ఏకంగా రూ. 2 కోట్లకు పైగా ఉండటం విశేషం.
ఫ్రెషర్ల నియామకాలపై ప్రభావం
ఈ సాంకేతిక మార్పుల వల్ల ఐటీ సంస్థలు ఫ్రెషర్ల క్యాంపస్ సెలెక్షన్లలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మొదటి రోజు నుంచే ప్రాజెక్టుల్లో నేరుగా పనిచేయగల నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉండే మొత్తం ఖాళీల్లో 3-5 ఏళ్ల అనుభవం ఉన్నవారికే సగం కంటే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రెషర్లు కేవలం ప్రాథమిక ఏఐ టూల్స్ నేర్చుకోవడం కాకుండా.. జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, ఏపీఐ, క్లౌడ్ ఇంటిగ్రేషన్, ప్రాజెక్ట్ అనుభవాన్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ పోటీ మార్కెట్‌లో మంచి ఉద్యోగాలు సాధించగలరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.






