- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికలాంగుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భరోసా
దివ్యాంగ (వికలాంగుల) ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దివ్యాంగ (వికలాంగుల) ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో గల ప్రకాశం హాల్ లో ‘తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల కృతజ్ఞత సభ’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలలో దివ్యాంగులకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించే అంశాన్ని కేబినెట్ భేటీలో సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తింపజేసేలా మాట్లాడతానన్నారు. దివ్యాంగుల అవసరాలు, కార్యకలాపాల కోసం సీఎంతో చర్చించి త్వరలోనే ఒక ‘సంక్షేమ భవన్’ను నిర్మిస్తామని ప్రకటించారు. అన్ని శాఖల్లో దివ్యాంగులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడమే తన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.
నెలలో రెండు రోజులు ప్రత్యేక గ్రీవెన్స్: ముత్తినేని వీరయ్య
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ, దివ్యాంగ ఉద్యోగుల సమస్యల త్వరిత పరిష్కారానికి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతినెలా రెండు రోజులు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల సమన్వయంతో ఇప్పటికే వందలాది మంది దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






