ఇకపై ప్రతి ఏటా ‘తెలుగు మహోత్సవం’

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-26 14:51:13  IST  )

తెలుగు భాష, సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు గొప్పతనాన్ని చాటిచెప్పే లక్ష్యంతో ఇకపై ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ‘తెలుగు మహోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు....

ఇకపై ప్రతి ఏటా ‘తెలుగు మహోత్సవం’
X

దిశ‌, ఏపీ బ్యూరో: తెలుగు భాష, సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు గొప్పతనాన్ని చాటిచెప్పే లక్ష్యంతో ఇకపై ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ‘తెలుగు మహోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగిన తెలుగు మహోత్సవం ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భాషా పరిరక్షణ, సాంస్కృతిక పునరుజ్జీవనంపై ప్రభుత్వ కార్యాచరణను ఆయ‌న వివరించారు.

తెలుగు భాషకు పూర్వవైభవం..

తెలుగు ప్రపంచ శిఖరాగ్రాన నిలవాలనే సంకల్పంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఉండవల్లి గుహలను ఈ మహోత్సవానికి వేదికగా ఎంచుకున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తెలుగును విస్తృతంగా వినియోగించి భావితరాలకు భాషను అందించాలన్నారు. ఆంగ్ల భాష అవసరమే అయినప్పటికీ మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదని ఆయ‌న‌ సూచించారు.

ప్రాథమిక విద్యలో తెలుగుకు పెద్దపీట..

మాతృభాషలో బోధన వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో తెలుగును తప్పనిసరి చేస్తూ గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దే చర్యలు చేపట్టిందన్నారు.

తెలుగు భాషా చరిత్రపై ప్రత్యేక డాక్యుమెంటేషన్..

ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు పరిణామక్రమాన్ని సమగ్రంగా వివరించే ప్రత్యేక డాక్యుమెంటేషన్ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి వెల్లడించారు. తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేసి భావితరాలకు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, మాతృభాష ఎప్పటికీ మృతభాషగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

జానపద కళలకు పునర్జీవం..

పద్యనాటకాలు, తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ వంటి సంప్రదాయ కళారూపాలను పరిరక్షించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి ఉద్ఘాటించారు. నాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు త్వరలోనే నంది నాటకోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

కళాకారులు, కవులకు ప్రభుత్వ ప్రోత్సాహం..

ఉగాది కళారత్న పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు, తెలుగు భాషా పురస్కారాలు, గుర్రం జాషువా, బోయి భీమన్న పురస్కారాల ద్వారా కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆగస్టు 4న మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు, ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయ‌న వెల్లడించారు.

తెలుగు భాషాభిమానాన్ని చాటిన మంత్రి..

కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ స్వయంగా ‘విశ్వక్సేనుడు’ అనే పదాన్ని తెలుగులో రాసి భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కుండల తయారీ, కాలిగ్రఫీ ప్రదర్శనలు, సామెతల చెట్టు, తోలుబొమ్మలాటలను ఆసక్తిగా వీక్షించారు. రెండో తరగతి విద్యార్థి భగవద్గీత శ్లోకాలు పఠించడాన్ని అభినందించారు. తెలుగు భాషా వ్యాప్తికి సేవలందించిన కవులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను సన్మానించారు. భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించిన చిత్రాన్ని, సింహాద్రి వాణి రచించిన ‘కవితా కుసుమాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ప్రతి ఒక్కరూ తెలుగు భాషా పరిరక్షణకు పునరంకితం కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు. యువతను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన తెలుగు మహోత్సవం భాషాభివృద్ధికి కొత్త ఊపు తీసుకొస్తుందని అన్నారు.

భవిష్యత్ తరాలకు తెలుగును అందించడమే లక్ష్యం..

తెలుగు భాషను భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించాలనే లక్ష్యంతోనే ఈ మహోత్సవాన్ని నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. పుస్తకాలకే పరిమితం కాకుండా పిల్లలు, యువత నిత్యజీవితంలో తెలుగును ఉపయోగించే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మంత్రి చొరవతోనే మహోత్సవం విజయవంతం..

భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవ వల్లే చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఉండవల్లి గుహల వద్ద తెలుగు మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. అనంతరం ప్రముఖ గాయని శోభరాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపించి తెలుగు భాష మాధుర్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

Next Story