కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

by Malleboina Mahesh |   (  Updated:2026-07-26 14:35:27  IST  )

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి (హై పవర్డ్) కమిటీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జరిగే వివిధ పోటీ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వివాదం తర్వాత కేంద్ర పరీక్షల నిర్వాహణపై సంస్కరణలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు హై పవర్డ్ టాస్క్‌ఫోర్స్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నందన్ నిలేకని నాయకత్వంలో ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ముందుకు సాగనుంది. కాగా ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి కష్టానికి తగిన న్యాయం జరగడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. అలాగే తాము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

దేశంలోని విద్యార్థుల ప్రయోజనాలు, భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం అనేక కీలక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న శక్తులు ప్రస్తుతం జైలు గోడల మధ్య మగ్గుతున్నాయని ఆయన హెచ్చరించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల (Fast track courts)ను ఏర్పాటు చేశామని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మరింత కఠినమైన చట్ట నిబంధనలను తీసుకురావడానికి అడుగులు వేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.

అయితే రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల వ్యవస్థలో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకని (Technical expert Nandan Nilekani) నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి (హై పవర్డ్) టాస్క్‌ఫోర్స్‌ (High-powered task force)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై సమగ్ర నివేదికను అందిస్తుందని, దాని ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారు.

ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకనితో పాటు ఇస్రో (ISRO) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, నిఘా వర్గాల (IB) మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉన్నారు. ప్రశ్నాపత్రాల భద్రత, లీకేజీల నివారణ, పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించడంపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Next Story