- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు నోరుమెదపుకుండా నేడు మాపై విమర్శలా?.. రామచందర్ రావుపై మంత్రి పొన్నం ఫైర్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ తీరును మంత్రి పొన్నం తప్పుపట్టారు. చట్టసభల్లో పోటీకి అర్హత వయసు 21 సంవత్సరాలకు తగ్గించాలన్న ప్రతిపాదనపై బీజేపీ అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో హాయాంలో ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఒక్కరోజులో ఏర్పడినవి కావని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భారీగా పేరుకుపోయిన వారసత్వ సమస్య ఇది అన్నారు. గత ప్రభుత్వంలో రామచందర్ రావు ఎందుకు మౌనం వహించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ, దేశంలో తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడ ఈ పథకాన్ని అమలు చేస్తుందో స్పష్టం చేయాలన్నారు. విద్యార్థుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని కనీసం రాష్ట్రాలపై ఉన్న ఆర్థిక భారాన్ని పంచుకుంటూ కేంద్రం కూడా తన వంతు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డైవర్షన్ కోసమే ఈ నాటకాలు:
దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించాలన్న ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ నాయకులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుందా? లేదా? ఈ విషయాన్ని రామచంద్రరావు స్పష్టంగా చెప్పాలన్నారు.
విద్యార్థి సంఘాల ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి?:
విద్యార్థి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్నది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం అని ఈ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో కూడా వెల్లడించాలన్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలకు బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా వ్యతిరేకిస్తుందా? అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. పరీక్ష పేపర్ల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న బీజేపీకి, విద్యార్థుల గురించి ప్రశ్నించే కనీస నైతిక అర్హత లేదన్నారు.






