రైతులకు మెరుగైన సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యం : మంత్రి తుమ్మల

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

రైతులకు మెరుగైన సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యం : మంత్రి తుమ్మల
X
  • వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరుపై తనిఖీలు
  • ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్​శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఆరు ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల నియంత్రణలో పనిచేస్తూ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఈ వారం తనిఖీ చేయనున్నాయి. ప్రత్యేక బృందాలు మార్కెట్ కమిటీల పరిపాలన, రైతులకు అందుతున్న సేవలు, మార్కెట్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించనున్నాయి. రైతులు తమ పంటలను విక్రయించే సమయంలో ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలతో పాటు కనీస మద్దతు ధర కొనుగోలు కార్యకలాపాల్లో ఉన్న లోపాలు, ఇబ్బందులు గుర్తిస్తాయి. రైతులు తమ పంటలను నష్టపోయే ధరలకు విక్రయించాల్సిన పరిస్థితులకు దారితీస్తున్న కారణాలు, మార్కెట్ సెస్ ఎగవేతను నివారించేందుకు అవసరమైన చర్యలు చేపడుతాయి. మార్కెట్ కమిటీల పరిపాలన, మౌలిక సదుపాయాలు, సేవలపై సూచనలు మార్కెట్‌లో గిట్టుబాటు ధర పొందుతున్నారా వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా అనే అంశాలను పరిశీలన జరుగుతుంది. కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాల నిర్వహణ, కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయా అనే అంశాలను తెలుసుకుంటాయి. మార్కెట్ కమిటీలలో అమలవుతున్న డిజిటల్ సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ మార్గదర్శకాల అమలును జరగడం చూస్తాయి. ప్రత్యేక బృందాలు ప్రతి వారం తమ తనిఖీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. నివేదికల్లో గుర్తించిన లోపాలు, తక్షణ చర్యలు అవసరమైన అంశాలు, విధానపరమైన సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు పొందుపరుస్తాయి. రైతుకు గిట్టుబాటు ధర, మార్కెట్‌లో మెరుగైన సౌకర్యాలు, పారదర్శకమైన లావాదేవీలు, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యం అని బాధ్యతాయుత పరిపాలన ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story