8 నెలల గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త.. తండ్రి నాటకం గుట్టు రట్టు చేసిన 5 ఏళ్ల కుమారుడు

by Prasad Jukanti |

8 నెలల గర్భంతో ఉన్న భార్యను నరికి చంపేసి నాటకానికి తెరలేపాడో భర్త. తన తండ్రి చేసిన దుర్మార్గాన్ని ఐదేళ్ల కుమారుడు బయట పెట్టాడు.

8 నెలల గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త.. తండ్రి నాటకం గుట్టు రట్టు చేసిన 5 ఏళ్ల కుమారుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గర్భంతో ఉన్న భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. కనికరం అనేది లేకుండా కొడవలితో నరికి చంపాడు. తల్లిని తమ కళ్ల ముందే తండ్రి చంపేస్తూంటే ఏం జరుగుతుందో తెలియక 5 ఏళ్ల బాబు, 2 ఏళ్ల పాల భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉండిపోయారు. ఈ హత్య తర్వాత తప్పించుకునేందుకు ఆ భర్త కంత్రీ ప్లాన్ వేయగా 5 ఏళ్ల బాబు తన తండ్రి గుట్టును రట్టు చేశాడు. గుండెలను పిండేసే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్రారీ గ్రామానికి చెందిన నిందితుడు హనీఫ్ మన్సూర్ మద్యపానం, జూదం వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాల కోసం తన ఆస్తిపాస్తులు, పొలాన్ని కూడా అమ్మేశాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మన్సూర్‍ను ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య మనీషా వారించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన హనీఫ్ ఇంట్లోని కొడవలి తీసుకొని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తల, చేతులు ఇతర శరీర భాగాలపై దాడి చేయడంతో ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తండ్రి నాటకాన్ని బయటపెట్టిన కుమారుడు:

హత్య చేసిన తర్వాత నిందితుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాటకానికి తెర లేపాడు. స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తన భార్య చనిపోయినట్లు చెప్పాడు. అయితే తన తల్లిని తండ్రి హనీఫ్ కిరాతకాన్ని చంపడాన్ని అక్కడే ఉండి తీవ్ర భయాందోళనకు గురైన వారి 5 ఏళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షి కింద పోలీసులకు అసలు విషయాన్ని చెప్పాడు. తండ్రే అమ్మను కొడవలితో నరికి చంపాడని చిన్నారి ఇచ్చిన వాంగ్మూలంతో భర్త అసలు గుట్టు రట్టైంది. చిన్నారి ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

వాడ్ని ఉరి తీయండి:

ఈ ఘటనపై నిందితుడి తండ్రి స్పందిస్తూ తనను నాలుగేళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లు చెప్పాడు. నా కొడుకు క్షమించరాని నేరం చేశాడు. వాడికి ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నాడు. నా మనవళ్లను నేనే పెంచుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కుల్ పహాడ్ సర్కిల్ ఆఫీసర్ అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. నిందితుడిని అరెస్ట్ చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story