విమానంలో పేలిన పవర్ బ్యాంక్..! ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో ఘటన

by Ramesh Naini |

విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీల విషయంలో మరోసారి కలకలం రేగింది.

విమానంలో పేలిన పవర్ బ్యాంక్..! ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీల విషయంలో మరోసారి కలకలం రేగింది. తాజాగా చైనాలోని ఓ విమానం ఓవర్‌హెడ్ బిన్‌లో పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటన విమానం ల్యాండ్ అయిన తర్వాత జరగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

అసలేం జరిగిందంటే..?

అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. జూలై 24న లాంఝౌ నుంచి గుయ్యాంగ్ వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం గుయ్యాంగ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రన్‌వేపై టెర్మినల్ వైపు వెళ్తుండగా, ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లోని పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయి లగేజీ క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. మంటలను చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో విమానం వెనుక భాగానికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఏమాత్రం కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పివేశారు. ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా విమానం దిగారని అధికారులు నిర్ధారించారు.

మరోసారి అధికారుల హెచ్చరిక

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా తరచుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు, మొబైల్ ఛార్జర్లు తీసుకెళ్లే విషయంలో ప్రయాణికులు నిబంధనలను (చెక్-ఇన్ లగేజీలో వేయకపోవడం లాంటివి) కచ్చితంగా పాటించాలని ఏవియేషన్ అధికారులు మరోసారి హెచ్చరించారు.

Next Story