కరీంనగర్ జిల్లాలో అమానుషం.. పీఎస్‌లో పిల్లల్ని వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-28 05:59:29  IST  )

కరీంనగర్ జిల్లాలో భార్యాభర్తల గొడవతో ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్ జిల్లాలో అమానుషం.. పీఎస్‌లో పిల్లల్ని వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్/తిమ్మాపూర్: తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పది ఏది లేదని చెబుతుంటారు పెద్దలు. కానీ, ఆ బంధానికి మచ్చతెచ్చేలా కన్నబిడ్డలను అమ్మ, నాన్నలు పోలీస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్లిన ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండల పరిధిలో చోటుచేసుకుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

అల్లనూరు గ్రామానికి చెందిన రవికుమార్ (Ravi Kumar), నిజామాబాద్ జిల్లాకు చెందిన లలిత (Lalitha) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి ఒక్కటైన వీరి సంసారం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న కారణాలతో గొడవలు మొదలయ్యాయి. ఈ మనస్పర్థలు కాస్తా ముదిరి ఒకరినొకరు భరించలేని స్థాయికి చేరాయి. ఈ క్రమంలో గొడవ పడుతూనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రవి, లలిత.. అధికారుల ముందే వాదులాటకు దిగారు. పంతానికి పోయిన ఇద్దరూ..‘పిల్లలు మాకొద్దు.. మీరే చూసుకోండి’అంటూ ఆ పసిపిల్లలను అక్కడే వదిలేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇక లలిత ఓ పేపర్‌లో మెడలో ఉన్న తాలిబొట్టుతో పాటు మెట్టెలను కూడా పిల్లల వద్దే వేసి వదిలేసింది. అప్పటివరకు తమ అమ్మానాన్నలు ఉన్నారన్న ధైర్యంతో ఉన్న ఆ పిల్లలు, ఒక్కసారిగా వారు కనిపించకుండా పోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. అయితే, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆ చిత్రం చూసిన ప్రతిఒక్కరి హృదయం ద్రవించిపోయింది.

పోలీసుల చొరవ.. కౌన్సిలింగ్‌

పీఎస్‌లో పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయిన తిమ్మాపూర్ పోలీసులు తక్షణమే స్పందించారు. వెళ్లిపోయిన రవికుమార్, లలితలను వెతికి తిరిగి స్టేషన్‌కు రప్పించారు. వారికి సుదీర్ఘంగా కౌన్సిలింగ్ (Counseling) ఇచ్చారు. గొడవలు సహజమని.. పసిపిల్లల భవిష్యత్తు ఏంటి? వారిని ఇలా వదిలేయడం నేరం మాత్రమే కాదు, అమానుషమని గట్టిగా మందలించారు. వారి హితబోధతో తమ తప్పు తెలుసుకున్న తల్లిదండ్రులు, చివరకు శాంతించి పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లారు.

Next Story