viral video: ఎంత లెక్కపెడితే అంతా మీకే.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపరాఫర్!

by Yella Dhawani Reddy |

సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్‌గానో, లేక రెండు నెలల జీతం బోనస్‌గానో ఇవ్వటం చూస్తుంటాం.

viral video: ఎంత లెక్కపెడితే అంతా మీకే.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపరాఫర్!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్‌గానో, లేక రెండు నెలల జీతం బోనస్‌గానో ఇవ్వటం చూస్తుంటాం. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు అద్బుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకటి.. రెండు.. కాదు.. ఏకంగా రూ.70 కోట్ల వార్షిక బోనస్ ఆఫర్ చేసింది. అయితే, దాన్ని తీసుకెళ్లేందుకు మాత్రం ఒక ఆసక్తికరమైన షరతు పెట్టింది.

చైనాకు చెందిన హెనన్‌ మైనింగ్‌ క్రేన్‌ సంస్థ తమ ఉద్యోగులకు రూ.70 కోట్ల వార్షిక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ మొత్తం డబ్బును 60 నుంచి 70 మీటర్ల పొడవైన టేబుల్‌పై పెట్టి, ఉద్యోగులను 30 టీమ్స్‌గా విభజించింది. ఆ తర్వాత ఒక్కో టీమ్ నుంచి ఇద్దరిని ఎంపిక చేసి వారికి 15 నిమిషాల సమయం ఇచ్చింది. ఈ 15 నిమిషాల్లో వారు ఎంత మొత్తాన్ని లెక్కపెడతారో.. అంత మొత్తం ఆ టీమ్‌కు ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టింది. ఇంకేముంది.. ఉద్యోగులు పోటీపడి మరీ కరెన్సీ నోట్లను లెక్కించారు. ఇందులో ఒక ఉద్యోగి అత్యధికంగా 15 నిమిషాల్లో 86.65 లక్షల రూపాయలను లెక్కపెట్టి బోనస్‌గా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ బోనస్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు 'మా కంపెనీ కూడా ఇలానే ఇస్తూ ఉంటుంది. అయితే డబ్బుకు బదులుగా పనిని ఇస్తుంది' అని ఫన్నీ కామెంట్స్ చేయగా, మరికొందరు 'దీనికంటే డబ్బును నేరుగా ఖాతాల్లో వేయొచ్చు కదా. ఓ రకంగా ఇది అవమానించినట్లు ఉంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, హెనన్‌ మైనింగ్‌ క్రేన్‌ సంస్థ ఇలా చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఆశ్చర్యచకితుల్ని చేసింది. 2023 జనవరిలోనూ ఇదే విధంగా రూ.70 కోట్ల బోనస్ తన ఉద్యోగులకు ఇచ్చింది. తమ ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.

Next Story