ఉద్యమం ఉమ్మడి ఆశయమా... వ్యక్తిగత ప్రయోజనమా?

by Muthe.Rajitha |   (  Updated:2026-07-21 21:42:51  IST  )

తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి కోసం జరిగిన ఉద్యమం కాదు. ఒక పార్టీ కోసం జరిగిన ఉద్యమం అసలే కాదు. అది కోట్లాది ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనలకు, అణచివేతలకు ప్రతిరూపం.

ఉద్యమం ఉమ్మడి ఆశయమా... వ్యక్తిగత ప్రయోజనమా?
X

తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి కోసం జరిగిన ఉద్యమం కాదు. ఒక పార్టీ కోసం జరిగిన ఉద్యమం అసలే కాదు. అది కోట్లాది ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనలకు, అణచివేతలకు ప్రతిరూపం. "నీళ్లు, నిధులు, నియామకాలు", సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య పాలన వంటి ఆశయాల కోసం అనేక మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు వీధుల్లోకి వచ్చారు. సబ్బండ వర్గాలు, సకల జనులు ఉద్యమం చేశారు. వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచిన తర్వాత ఒక ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. తెలంగాణ ఉద్యమ ఆశయాలు పూర్తిగా నెరవేరాయా? సమాధానం అంత సులభం కాదు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, ప్రభుత్వ విద్య, వైద్యం, భూ సమస్యలు, గిరిజన హక్కులు, పర్యావరణ విధ్వంసం, ప్రజాస్వామిక హక్కుల వంటి అనేకం ఇప్పటికీ చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. ఇక్కడే మరో ప్రశ్న ఇంకా బలంగా వినిపిస్తుంది. మరి ఆ ఉద్యమకారుల పాత్ర ముగిసిందా? వారి లక్ష్యాలు మారాయా? ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పుకునే అనేక మంది ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారు. కొందరు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు దగ్గరగా ఉండగా, మరికొందరు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో అనుబంధంగా కనిపిస్తున్నారు.

అధికారంలో ఉండే వారిని ప్రశ్నించరా..?

అధికారంలో ఎవరు ఉంటే వారిని ప్రశ్నించకుండా ఉండటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఉద్యమ ఆశయాల గురించి మాట్లాడటం ఒక ప్రమాదకర ధోరణి. ఉద్యమకారుడి బాధ్యత అధికార పార్టీని అనుసరించడం కాదు, అధికారాన్ని ప్రశ్నించడం. ప్రజల పక్షాన నిలబడటం. ఉద్యమ సమయంలో ప్రభుత్వాలను ప్రశ్నించిన స్వరం, ఇప్పుడు కూడా అదే ధైర్యంతో వినిపించాలి. లేకపోతే సదరు ఉద్యమకారులు ‘ఫలానా’ రాజకీయ అనుబంధానికి పరిమితమైనట్లు ప్రజలకు అనిపించే ప్రమాదం ఉంది. ఇటీవల ఉద్యమకారుల గుర్తింపు, వారికి ప్రత్యేక హోదా, పెన్షన్, ఇంటి స్థలం, ఇళ్లు, ప్రత్యేక ఆసుపత్రులు వంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

వ్యక్తిగత ప్రయోజనాలతోనే ఆగిపోతారా?

ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడం, తీవ్రంగా గాయపడిన వారికి సహాయం చేయడం, త్యాగాలను చారిత్రకంగా గుర్తించడం వంటి చర్యలు సమాజం చేయాల్సిన నైతిక బాధ్యతే. దీనిపై పెద్దగా భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్యమం చేసినవారమని గుర్తింపు పొందినవారిని ప్రత్యేక సంక్షేమ ఫలాలకు లబ్దిదారివర్గంగా సృష్టించడం మాత్రం చర్చించాల్సిన విషయమే. ఉద్యమం ఒక ఉమ్మడి లక్ష్యంగా జరిగినదైనప్పుడు దానికి ప్రతిఫలంగా వ్యక్తిగత ప్రయోజనాలు కోరడం సదరు ఉద్యమకారులు ఉద్యమస్ఫూర్తిపైనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. విశాల ప్రజానీకం కోసం జరిగిన పోరాటం.. వ్యక్తిగత ప్రయోజనాలకు ఆధారంగా చేసుకోవడం.. ఆ పోరాటాన్ని వ్యక్తిగత హక్కుల జాబితాకు కుదిస్తే ఆ ఉద్యమ నైతికతే బలహీనపడే ప్రమాదముంది.

నేటి తెలంగాణ ముందు కొత్త ప్రశ్నలు

నేడు తెలంగాణ సమాజానికి అత్యవసరమైన ప్రశ్నలు వేరే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందరికీ అందుతోందా? రైతుల ఆదాయం పెరిగిందా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? గిరిజనుల భూ హక్కులు రక్షించబడుతున్నాయా? మహిళల భద్రత మెరుగుపడిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఉద్యమకారుల మొదటి బాధ్యత కావాలి. ప్రత్యేక ఆసుపత్రి కోరే బదులు ప్రతి పేదవాడికి నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందాలని డిమాండ్ చేస్తే అది తెలంగాణ ఆశయాలకు దగ్గరగా ఉంటుంది. ఇంటి స్థలం తమకోసం అడిగే బదులు భూమిలేని పేదలందరికీ గృహ హక్కు కోసం పోరాడితే అది ఉద్యమానికి గౌరవాన్ని తెస్తుంది. వ్యక్తిగత ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనం ముందుంటేనే ఉద్యమం తన నైతిక ఉన్నతిని నిలబెట్టుకోగలదు.

పార్టీ రాజకీయాలకు పరిమితం కావద్దు

అదేవిధంగా ఉద్యమకారుల గుర్తింపు అవసరం. అమరుల త్యాగాలకు శాశ్వత గౌరవం అవసరం. కానీ అసలు ఉద్యమాకారుల గుర్తింపైన ప్రశ్నించే బాధ్యతను పక్కనపెట్టి.. అధికార పార్టీ మారినప్పుడల్లా తన వైఖరిని మార్చుకుంటే, అది ఉద్యమ రాజకీయాలకు కాదు, పార్టీ రాజకీయాలకు సంకేతంగా మారుతుంది. అదీ ప్రజాస్వామిక తెలంగాణను ఆశించిన ఉద్యమకారుల తీరు అసలే కాదు. ప్రభుత్వాల నుంచి ప్రత్యేక సౌకర్యాల కోసం మాత్రమే స్వరం వినిపిస్తే, తెలంగాణ ఉద్యమ ఆశయాలు, (రంగులుమార్చే)ఉద్యమకారులపై గౌరవం మసకబారుతుంది. భౌగోళిక, బూర్జువా రాజకీయలు చేసినవాళ్లకు వాళ్లనుకునే కలలు నెరవేరుతున్నాయేమోగానీ.. ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ డిమాండ్‌తో పని చేసిన వాళ్ళ ఆశయాలు కూడా నెరవేరాయా? ఇది ఎవరివారు వేసుకోవాల్సిన ప్రశ్న. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఆదిలాబాద్‌లో, వరంగల్ వివిధ జిల్లాల్లో గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తున్న ప్రజలకు సంఘీభవంగా ఉండాల్సిన అవసరం లేదా? దున్నే వాడికి భూమి కావాలి.. ఇల్లు లేని ప్రజలకి పక్కా ఇంటి నిర్మాణం చేయించి ఇవ్వాలని నినదించిన గొంతులు ఇవ్వాళ ప్రజా సమస్యలను మారిచిపోయాయా?

మేం రోడ్లమీదకు వస్తే మీరు పేరు సంపాదిస్తారా?

ఉద్యమకాలంలో సకల ప్రజానీకం కోసం వినిపించిన నినాధాలు నేడు కొంత మంది కోసం మాత్రమే వినిపించటం అనేది బాధకరమైన విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మౌలిక సమస్యలు, ప్రజాస్వామిక విలువల మీద గొంతెత్తాల్సిన ప్రజాస్వామిక గొంతులు ఇలా ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం కాకుండా రాజ్యం ఎత్తుగడలో కొట్టుకుపోతున్నారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని గొంతులను తనలో కలుపుకుంది, తర్వాత వారి ప్రజాస్వామిక చైతన్యం స్థాయిని తెలంగాణ సమాజం చూసింది! ఈ సందర్భంగా ఒక చిన్న ఘటన గుర్తుకొస్తున్నది. ఓ ఉద్యమకారుడు ఆందోళనల్లో పాల్గొనాలని ఓ లైబ్రరీలోకి వెళ్లి విద్యార్థులను కోరగా.. ‘ఎందుకన్నా? మేం వచ్చి రోడ్లమీద నిలబడితే మీరు మా ముందు నిలబడి పేరు సంపాదించడానికేనా?’ అని ఓ స్టూడెంట్ నిలదీశాడు. ఆ స్టూడెంట్ అనుమానమే నిజమవుతున్నదా?

-అనిల్ కుమార్ పీఎస్

రీసెర్చ్ స్కాలర్

94916 12202

Next Story