ధర్మం రక్షిస్తుంది... శిక్షిస్తుంది కూడా!

by Muthe.Rajitha |

"జాతిపిత" అని మనం కీర్తిస్తున్న "మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం" పేరు గతమై, "వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజుగార్ ఎండ్ ఆజీవికా మిషన్( గ్రామీణ్)" తెరమీదకు వచ్చింది.

ధర్మం రక్షిస్తుంది... శిక్షిస్తుంది కూడా!
X

"జాతిపిత" అని మనం కీర్తిస్తున్న "మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం" పేరు గతమై, "వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజుగార్ ఎండ్ ఆజీవికా మిషన్( గ్రామీణ్)" తెరమీదకు వచ్చింది. వీడని సామాజిక సప్త పాపాలు. ఎప్పుడో ఆ మహాత్ముడు ప్రవచించిన సప్త పాపాల గురించి ఇప్పుడు ప్రస్తావించడం మూర్ఖత్వం కావచ్చు. కానీ, "సిద్ధాంతం లేని రాజకీయాలు" నేడూ రాజ్యమేలుతున్నాయి. "శ్రమ లేని సంపద"'గురించి చెప్పక్కర్లేదు.

ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో భారతీయులు కూడా చేరుతున్నారు. అయినప్పటికీ దేశంలో కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వబడుతున్నాయి. "మనస్సాక్షి లేని సుఖభోగాల " గురించి వేరే చెప్పాలా? ఎందుకంటే ఎవరి మనసే వారికి సాక్షి.‌ కాకపోతే ప్రియుడితో కలిసి భర్తలను చంపిన భార్యలు, అటుదిటూ, అంతటితో ఆగకుండా అడ్డు తొలగించుకోవడం కోసం పసికూనలని కిరాతకంగా హతమార్చడం గురించి ఇంచుమించు ప్రతిరోజూ వార్తాపత్రికలు, టెలివిజన్లు ఘోషిస్తూనే ఉన్నాయి.

జ్ఞానం లేని శీలం ఏనాటిదో...

"జ్ఞానం లేని శీలం" ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ప్రసార సాధనాలు కొల్లలు కావడంతో శృతి మించినట్లు అనిపిస్తోంది. కానీ పెను విషాదం ఏమంటే, అట్లాంటి వారిని కూడా తలకెక్కించుకునే భక్త జనం ఉండడం. ప్రభుత్వాలు కూడా అట్లాంటి వారికి ఉదారంగా పెరోల్ లు ప్రసాదించడం. "మానవత్వం లేని విజ్ఞానం" మాత్రం దురన్వయంతో పాటించబడుతోంది. వైరి పక్షం నేలమీద కాలైనా మోపకుండా, వారి గగనతలంలోకి మానవ రహిత యుద్ధ విమానాలనే పంపుతూ, తమవారికి ప్రాణ నష్టం కలగకుండా ఇరుపక్షాలూ జాగ్రత్త పడగలుగుతున్నాయి.

పిడుగే పడింది

ఈ ఏకరువంతా ఎందుకంటే, మహాత్ముడు ఏడవ పాపమని పేర్కొన్న "త్యాగభావం లేని ఆరాధన " కు ఆనాటికే కాలం చెల్లిందనుకుంటున్న నాలాంటి వాళ్లు కూడా నిర్ఘాంతపోయే పిడుగు జూన్ 7, 2026 న పడింది. రామ్ లల్లాను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు హుండీలలో సమర్పిస్తున్న విరాళాల నుండి సుమారు ₹7 కోట్ల నుండి ₹7.5 కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

విస్తుగొలిపే వాస్తవాలు

దరిమిలా జరిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన ప్రాథమిక విచారణలో ఇప్పటికి తేల్చినదేమంటే.. సిబ్బంది కుమ్మక్కై భారీగా నగదును స్వాహా చేసారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను తప్పించుకుంటూ 42 రోజుల్లో 70 సందర్భాల్లో నగదు అపహరించబడింది.( సిట్ అధికారులు సుమారు ₹80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు). అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చుకుని ఉండవచ్చు. నియమాలకు విరుద్ధంగా ఒక చిరుద్యోగి వద్ద పలు హుండీల తాళం చెవులు భద్రపరిచారు. కుంభకోణంలో అత్యధిక వాటా ఈయన వద్దే దొరికింది. సిట్ అధికారిక దర్యాప్తు కంటే ముందే ఆలయ నిర్వహకులు విరాళాలు లెక్కింపులో పాల్గొన్న ఒక ఉద్యోగి నుండి గణనీయంగా భారీగా నగదు, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు జరుగుతున్న చోట కెమెరాలకు అడ్డుగా నిలబడడం, బట్టల్లో/వాష్‌రూముల్లో డబ్బు దాచడం, జరిగింది. భక్తులు సమర్పించిన 60 కేజీల వెండి కడ్డీలు రికార్డులలో నమోదు ధృవ పడాలి. మాయమైన విలువైన వస్తువులు ట్రస్ట్ లెక్కల్లోకి రాకపోయి ఉండవచ్చు

కోయిల కొంత ముందే కూసినా ఫలితం లేదు

ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ధర్మకర్తల మండలి మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల సమావేశంలో 2025 లోనే కొన్ని ప్రామాణిక నిర్వహణ విధానాలు ( స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) నిర్ణయించారు. అందులో కొన్ని: విరాళాల లెక్కింపు సమయంలో భద్రతాసిబ్బంది ఒకరు ఉండాలి. విరాళాలు లెక్కించేవారు వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు తనిఖీలు నిర్వహించాలి. మొత్తం ఏరోజుకారోజు లెక్కింపు ప్రక్రియను వీడియో రికార్డ్ చేసిన ఫుటేజ్ ని 180 రోజులు వరకు భద్రపరచాలి.. ఈ నిర్ణయాలన్నీ గాలికి వదిలేసారు.

వ్యవస్థపైనే అనుమానాలు తలెత్తితే ఎలా?

అయోధ్య రామమందిరం అశేష భక్తకోటి విశ్వాసాలకు నిలువెత్తు గోపురం. దేశం నలుమూలల నుంచి భక్తులు సమర్పించిన రామశిలలు కూడా భాగమైన నిర్మాణం. కొందరు కర సేవకుల ప్రాణత్యాగ ఫలితం. హుండీలో పడేవి నగదు, నగలు కావు.‌ భక్తుల విశ్వాసాలు. ఆ విశ్వాసాన్ని కాపాడలేకపోతే. నష్టపోయేది ట్రస్ట్ సంపదే కాదు, సమాజం యొక్క నైతిక మూలధనం కూడా. సిట్ దర్యాప్తు పుణ్యమాయని.... ఎనిమిది మంది నిందితులు అరెస్టయ్యారు. దర్యాప్తు విస్తరించడంతో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, ఒక ట్రస్టీ తమ రాజీనామాలను సమర్పించారు. అదే సమయంలో ట్రస్ట్ గత ఐదేళ్ల ఖాతాలపై సమగ్ర రీ-ఆడిట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. తుది నిజాలు న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉన్నప్పటికీ, భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన వ్యవస్థపైనే అనుమానాలు తలెత్తడం అత్యంత బాధాకరం.

మన ప్రాధాన్యాలు మారాలి

ప్రజలు ఏ దుస్తులు ధరించాలో, ఏ పదార్థాలు భుజించాలో, పాఠశాలలలో ఏ ప్రార్థనాగీతాలు పాడాలో, ఆలయ పరిసరాలలో ఎవరు దుకాణాలు నిర్వహించుకోవచ్చో, కొన్ని రోజులలో ఏ ఆహార పదార్థాలు అమ్మరాదో, వగైరా విషయాలపై పెట్టే శ్రద్ధ, ప్రార్థనా స్థలాల సక్రమ నిర్వహణపై ఉండాలి. "ధర్మకర్త' అనే పదవిలో 'ధర్మం' ముందుంది, 'కర్త' తర్వాత. ధర్మాన్ని వెనక్కినెట్టి పదవిని ముందుంచేవారు కాదు; పదవిని ధర్మసేవగా భావించేవారే ధర్మకర్తలుగా బాధ్యతలు చేపట్టే వ్యవస్థ ఏర్పడాలి. ప్రార్థనాస్థలాల గోడలు రాతితో కడతారు. వాటి ప్రతిష్ఠను మాత్రం భక్తుల విశ్వాసంతో నిర్మిస్తారు. రాతి గోడలు కూలిపోతే మళ్లీ కట్టవచ్చు. విశ్వాసం బీటలు వారితే, దాన్ని పునర్నిర్మించడం అంత తేలిక కాదు. అందుకే 'త్యాగభావం లేని ఆరాధన' మహాత్ముని దృష్టిలో సామాజిక పాపమైఃది. ధర్మాన్ని నాశనం చేసినవారిని ధర్మమే నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షించినవారిని ధర్మమే రక్షిస్తుంది. ఆ ఆశతోనే ఉందాం.

మల్లాప్రగడ రామారావు

విశ్రాంత ప్రభుత్వాధికారి

99898 63398

Next Story