- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యోటో నగరం - జపాన్ పర్యటన - 3
మరునాడు ఉదయమే హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, క్యోటో నగరానికి బయలుదేరాం. సుమారు గంటన్నర ప్రయాణించి అక్కడికి పదిగంటలకు చేరుకున్నాం. ఒసాకానుంచి క్యోటోనగరం దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

మరునాడు ఉదయమే హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, క్యోటో నగరానికి బయలుదేరాం. సుమారు గంటన్నర ప్రయాణించి అక్కడికి పదిగంటలకు చేరుకున్నాం. ఒసాకానుంచి క్యోటోనగరం దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
జపాన్ లో అత్యంత ప్రాచీనమైన చారిత్రక నగరం క్యోటో. నారా నగరం నుంచి రాజధాని క్యోటో నగరానికి మారిన తర్వాత క్రీ.శ. 794 నుండి 1868 వరకు జపాన్ కు రాజధానిగా ఉన్నది. దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా రాజధానిగా ఉండడం వల్ల ఇక్కడ ప్రాచీన సంప్ర దాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా బౌద్ధ దేవాలయాలు, షిoటో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ నగరం గీషా సoస్కృతికి ప్రసిద్ధి. కిమోనో ధరిoచిన వాళ్ళను ' గీషాలు ' అంటారు. ' కిమోనో ' అంటే జపాన్ సంప్రదాయ దుస్తులు. జపాన్ వాళ్ళ గ్రీన్ టీని అందించే సంప్రదాయ టీ సెరిమనీ ఇక్కడే మొదలైంది.
హిగాషియామా (తూర్పు కొండలు)కితాయామా, ( ఉత్తరం వైపు కొండలు ) నిషియామా ( పశ్చిమ కొండలు ) అనే పర్వతాల నడుమ ఉన్న అందమైన లోయ ప్రాంతం ఈ నగరం. ' యామా ' అంటే జపానీ భాషలో ' కొండ లేదా పర్వతం ' అని అర్థం. మేం ముందుగా ' కింకాకు - జీ ' టెంపుల్ కు వెళ్లాం. ఇది ఈ కొండల అడుగు భాగంలోనే ఉన్నది. దీనిని " గోల్డె న్ పెవిలియన్ " అని పిలుస్తారు. ఇది క్యోటోలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జెన్ బౌద్ధ దేవాలయం. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద.
ఈ ఆలయం పై రెండు అంతస్తులు మేలిమి బంగారు రేకులతో కప్పబడి ఉన్నాయి. మూడు అంతస్తుల ఈ దేవాలయం ప్రతి అంతస్తు వేర్వేరు నిర్మాణ శైలిలో ఉన్నది. మొదటి అంతస్తు పూర్వపు
రాజుల రాజ భవనం లాగా టేకుతో, తెల్లటి ప్లాస్టర్తో ఉన్నది. రెండో అంతస్తు యోధుల (సమురాయ్) నివాస భవనం శైలిలో ఉన్నది. మూడో అంతస్తు చైనీస్ జెన్ హాల్ శైలిలో ఉండి లోపల, బయట బంగారంతో మెరుస్తూ ఉన్నది. దీని పైకప్పుపై ఒక బంగారు పక్షి (ఫీనిక్స్) విగ్రహం ఉన్నది. ఈ ఆలయం ముందు ఒక కొలను ఉంది. దానిని ' మిర్రర్ పాండ్ ' అని, జపనీస్ లో ' క్యోకో - చి ' అని పిలుస్తారు. పచ్చని కొండల నడుమ ఈ నీటిలో బంగారు భవనo ప్రతిబింబం అద్భుతంగా ఉంటుంది. ఆలయం వెనక వైపు ఉన్న చెరువును ' అన్మింతాకు ' అని పిలుస్తారు. ఈ చెరువు ఎప్పటికీ ఎండిపోదు అని అక్కడి ప్రజల నమ్మకం. దానిని పవిత్రమైనదిగా భావించి నాణాలు విసురుతారు. అయితే ప్రస్తుతం ఈ దేవాలయంలోకి ప్రవేశం లేదు.
అషికాగా యోషిమిత్సు అనే రాజు క్రీ శ 1397లో తన విశ్రాంతి కొరకు దీనిని నిర్మించుకున్నాడట. 1408లో ఆయన మరణించిన తర్వాత ఆయన కోరిక మేరకు ఇది బౌద్ధ దేవాలయంగా మారింది. 1467- 1477 ఒనిన్ యుద్ధంలో రెండుసార్లు కాలిపోయిందట. మానసిక రోగి అయిన ఒక యువ బౌద్ధ సన్యాసి 1950లో దీనికి నిప్పు అంటిoచడం వల్ల భవనం మొత్తం కాలిపోయిందట. యుకియో మిషిమా అనే రచయిత రాసిన " The Temple of the Golden Pavilion " అనే నవల దీని ఆధారంగానే రాశాడట. ఇపుడున్న నిర్మాణం 1955లో అదే శైలిలో నిర్మించినది. దేవాలయాన్ని చూసుకొని ముందుకు వెళితే జెన్ గార్డెన్ వస్తుంది. మురోమాచి కాలం నాటి ప్రాచీన శైలిలో దీని ఏర్పాటు జరిగింది. ఇక్కడి చెట్లు, రాళ్ళు ప్రకృతి సమతుల్యతను తెలుపుతాయి. అలా ఈ తోటలోనుంచి నడుస్తూ లోపలికి వెళితే చివరగా " సెక్కాటి టీ హౌస్ " వస్తుంది. ఇది జపనీయుల సంప్రదాయ టీ హౌస్ . దీనిని ఎడో కాలంలో ( Edo Period ) టీ తాగే సంస్కృతిని తెలియజేయడానికి మాడల్ గా పెట్టారు.
ముందు గేటునుంచి చివరి గేటు దాకా దాదాపు మూడు, నాలుగు కిలోమీటర్ల నడక ఉంటుంది. దారి కొంత దూరం ఎత్తు పల్లాలతో, రాళ్ళతో కూడి ఉంటుంది. అందువల్ల కొందరు దేవాలయాన్ని మాత్రం చూసుకొని వెనక్కి వెళుతుంటారు. కానీ కొంచం శ్రమ పడితే అద్భుతమైన తోటలోని శిలా సౌందర్యాన్ని, జపనీయుల సంస్కృతిని కొంత తెలుసుకో వచ్చు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటలదాకా సందర్శన వేళలు. ఒక్కరికి 400 యెన్లు ప్రవేశ రుసుం.
అక్కడి నుంచి ఫుషిమి అనే ప్రాంతానికి వెళ్ళాం. ఆ బజార్ అంతా తిరుగుతూ జపాన్ సంప్రదాయ దుస్తులు ' కిమినో ' ధరించడానికి ఒక షాప్ లోకి వెళ్ళాం. ఒక్కరికి వెయ్యి యెన్లు. విపరీతమైన రద్దీ ఉంది. మూడు వరుసలుగా ఉండే ఆ సిల్క్ దుస్తులు ధరించడం ఎండవల్ల నాకు సాధ్యం కాదని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. అందుకే అక్కడినుంచి కిందకు దిగి చూస్తే ఎదురుగా ఒక వంతెన గుండా పారుతున్న చిన్న కెనాల్ కనిపించింది. దాని తీరంలో వరుసగా చెర్రీ పూల బరువుతో వంగిన చెట్లు వరుసగా ఉన్నాయి. అంతే! అక్కడికి వెళ్ళిపోయి నడక మొదలు పెట్టాను. అందమైన అలాంటి ప్రదేశంలో ఫోటోలు తీసుకొని, కుడివైపుగా వున్న నివాస ప్రాంతంలోకి వెళ్ళాను. ఇరుకైన సందులతో జపాన్ సంస్కృతి, వాస్తు శైలిని తెలిపే ఇళ్ళను చూసాను. ప్రతి ఇంటిముందు కుండీల్లో పూలమొక్కలు అందంగా అమర్చారు. ఆ పక్కనే ఒక నీళ్ళ బాటిల్ ఉంది. అది జపాన్ సంస్కృతిలో ఆ రెండింటికీ ఉన్న అవినాభావసంబంధాన్ని తెలుపుతుంది. ఇంటివాళ్ళు లేనప్పుడు, మొక్కలకు నీళ్ళు అవసరమై నప్పుడు ఎవరైనా ఆ దారిలో వెళ్ళేవాళ్ళు సైతం పోయడానికి వీలుగా ఆ ఏర్పాటని స్థానికులు చెప్పారు.
గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు దగ్గరలోనే ' ఫుషిమి ఇనారి ' టెంపుల్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాను. కొత్త చోట్లలో ఒంటరిగా తిరగడం భలే థ్రిల్లింగ్ గా ఉంటది. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. నాకైతే అలా తిరగడం చాలా యిష్టం. ఈ దేవాలయం జపాన్ లో అత్యంత ప్రసిద్ధమైన ' షింటో ' మతానికి చెందింది. ఇక్కడున్న " ఇనారి ఓకామి " దేవతను వరి, వ్యవసాయం, వ్యాపారం, సంపదకు అధిపతిగా పూజిస్తారట. దేశంలో సుమారు 30000 ఇనారి దేవాలయాలు ఉంటే వాటి అన్నింటికీ క్యోటోలో ఉన్న ఈ ఆలయమే ప్రధాన కేంద్రం అని గైడ్ చెప్పాడు. క్యోటో జపాన్ కు రాజధానిగా కాకముందే క్రీ.కు 711లో 'హటా' వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. ఓనిన్ యుద్ధంలో కాలిపోతే ప్రస్తుత ఆలయ భవనాన్ని క్రీ.శ 1499లో తిరిగి నిర్మించారు.
ఆలయానికి వెళ్ళే దారిలో ఎరుపు రంగులో ఉన్న తోరీ గేట్ల వరుస ఆ మార్గానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఆలయ ద్వారాన్ని ' రోమోన్ గేట్ ' అని పిలుస్తారు. క్రీ.శ1589లో జపాను పాలించిన ' టుయోతోమి హిదేయోషి ' తన తల్లి ఆరోగ్యం బాగా అయినందుకుగాను కృతజ్ఞతగా దానిని నిర్మించి యిచ్చాడట. ఆలయ ప్రాంగణంలో నోట్లో వరి కంకి లేదా తాళం చెవితో ఉన్న నక్క విగ్రహాలు చాలా కనిపించాయి. ఇనారి దేవతకు దూతగా(నక్కలను) కిట్సునేలను భావిస్తారట. వాటిని చూసి నప్పుడు నాకు మన కాళికాదేవి గుర్తుకు వచ్చింది. మన హిందూ పురాణా లలో కూడా దేవతలకు జంతువుల విగ్రహాలు వాహనాలుగా ఉంటాయి కదా.. మా బృందంలోని సురేఖ, ప్రభ, భ్రమర, కొందరు కిమినో దుస్తులు ధరించి ఈ దేవాలయానికి వచ్చారు.
ముందే చెప్పినట్లుగా క్యోటో నగరం దాదాపు పర్వతాల లోయ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇనారి ఆలయం వెనక వైపునుంచి పర్వత శిఖరానికి ట్రెక్ చేయవచ్చునని, ఆ దారిలో వేలసంఖ్యలో ఎరుపు రంగు తోరీ గేట్లతో పచ్చని ప్రకృతి మరీ అందంగా కనిపిస్తుందని, రాత్రి పూట విద్యుద్దీపాల కాంతి మరింత ఆకర్షణగా ఉంటుందని, రాత్రి సమయంలో కూడా ట్రెక్ చేయవచ్చునని ఈ గుడిలో కలిసిన స్థానికుల వల్ల తెలిసింది. నాలుగు కిలోమీటర్ల దూరంలో 233 మీటర్ల ఎత్తుతో ఉండే ఆ పర్వతం పైకి వెళ్ళి రావడానికి సుమారు మూడు నాలుగుగంటల సమయం పడుతుంది. ట్రెక్కింగ్ అంటే అమితంగా యిష్టపడే నేను అది చేయలేక పోయినందుకు చాలా బాధ పడ్డాను. కారణం మా బృందంలో ఎవరూ అందుకు సిద్ధంగా లేరు. నేను వెళతానని అడగడానికి కూడా అది సమయం సందర్భం కాదు.
మనసులో ట్రెక్ కు వెళ్ళలేదన్న బాధ, కడుపులో ఆకలి బాధతో మెయిన్ రోడ్డులోకి వచ్చాను. ఎదురుగుండా సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి, తినడానికి శాకాహారం ఏమైనా ఉందేమోనని చూసాను. కానీ నాకు ఏమీ కనిపించలేదు. ఇంతలోకి అటువైపుగా ఆకాశ్ ( గైడ్} వచ్చాడు. "ఏమిటి మేడం? అలా నీరసంగా దిగులుగా కూర్చున్నారు?" అడిగాడు. ట్రెక్ చేయలేకపోయిన దిగులు, ఆకలివేస్తున్న సంగతి చెప్పాను. ఆయన వెంటనే వెళ్ళి పదినిముషాలలో జపాన్ ప్రత్యేక శాకాహారం సాగు సూషీ తెచ్చి యిచ్చాడు. అవి నాలుగు తినేసరికి కడుపునిండి పోయింది.
అక్కడి నుంచి బస్సులో అరగంటలో ' టోగెట్సుక్యో బ్రిడ్జ్ ' వద్దకు వెళ్ళాం. ఇది టోక్యోలోని చారిత్రాత్మకమైన వంతెన. ' కట్సరా ' నదిపైన 155 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఆవలి తీరంలో వికసించిన చెర్రీపూల చెట్ల వరుసలు పర్యాటకులను చూపు తిప్పనివ్వవు. నది ఒడ్డున ఆ చెట్లకింద నడక గొప్ప అనుభూతిని ఇస్తుంది కానీ అప్పటిదాకా చెర్రీపూల చెట్ల వరుసలను చాలా చూసి ఉన్నందువల్ల మా బృందంలోని నలుగురం కొత్త అనుభూతి కొరకు అక్కడికి దగ్గరలో ఉన్న ' బాంబూ ఫారెస్ట్ ' కు వెళ్ళాo.
క్యోటో నగరంలో వెదురు అడవి చాలా ప్రసిద్ధమైంది. గగన చుంబిత భ్రమను కలిగించే అత్యంత పొడవైన వేలాది వెదురు చెట్ల నడుమ నుంచి సాగే మార్గంలో నడవడం గొప్ప అనుభవం. దారి కొంతదాకా బాగానే ఉంది. మరికొంత దూరం ఎత్తు పల్లాలతో ఉండడం వల్ల నలుగురు లోనుంచి ఇద్దరు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. నేను, రేఖ ముందుకు సాగాం. వెదురు చెట్లు గాలికి ఊగడం వచ్చే శబ్దాలు ప్రకృతి సంగీత కచేరి చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ ధ్వనులను జపాన్ ప్రభుత్వం జపాన్ లోని వంద అద్భుతమైన ధ్వనులలో ఒకటిగా గుర్తించిందని స్థానికులు చెప్పారు. (100 Soundscapes of Japan ). వెదురు కర్రతో తయారు చేసిన పిల్లన గ్రోవి శబ్దమే మనలను సంగీత ప్రపంచంలో విహరిoపజేస్తుంది కదా : అలాంటిది వేలాది వెదురు వృక్షాలు గాలికి ఉయ్యాలలూగినప్పుడు వచ్చే శబ్దం ఎలాంటి సంగీత దిగంతాలకు తీసుకొని పోతుందో ఇక్కడ స్వయంగా విని అనుభవిస్తేనే తెలుస్తుంది. అంతేకాని, ఆ అద్భుతాన్ని అక్షరాలలో పలికించలేo. అలా వింటూ చివరగా వెళ్ళి చూస్తే.. ఇరువైపులా ఎత్తైన వెదురు వృక్షాలు కరచాలనం కోసం ప్రయత్నిస్తున్నట్లుంది.
మాకు అడవి అంతా తిరిగి రావడానికి ఒక గంట పట్టింది. వెదురు వృక్షాల సందులలోనుంచి కొంచం లోపలికి వెళ్ళి గమనిస్తే అక్కడ అక్కడా స్థానికుల సమాధుల కళాత్మక నిర్మాణాలున్నాయి. మన దేశంలో సమాధులుoడే స్మశాన వాటికలను అశుభంగా భావిస్తాం. ఇప్పుడిప్పుడే హైదరాబాదులాంటి చోట్ల అత్యాధునికమైన స్మశాననాటికలు ఏర్పడుతున్నా ప్రజలలో ఉన్న మూఢనమ్మకం మాత్రం పోలేదు. కానీ నేను చూసిన చాలా దేశాలలో స్మశాల వాటికలు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. మన దగ్గర ఉన్న గోలకొండ టూoబ్స్ చారిత్రక ప్రదేశమైనప్పటికీ సరైన నిర్వహణ లేక వెలవెలబోతున్నాయి.
(ఇంకా వుంది)
________ ×________
గిరిజ పైడిమర్రి
ట్రావెలర్
99494 43414






