- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హతలున్నా దక్కని పదోన్నతి స్కేళ్లు!
ప్రభుత్వ ఉత్తర్వులు ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను, పదోన్నతులను సకాలంలో పొందలేకపోతున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులు ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను, పదోన్నతులను సకాలంలో పొందలేకపోతున్నారు. ముఖ్యంగా 45 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, డిపార్ట్‌మెంటల్ పరీక్షలు పాస్ కాలేదనే నెపంతో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంలో 12 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేలు మంజూరుకు నోచుకోని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.225 (జీఏడీ), తేదీ: 18.05.1999, జీవో నెం.96 (ఫైనాన్స్), తేదీ: 20.05.2011ల ప్రకారం... 45 ఏళ్ల వయసు దాటిన వారికి డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత నుండి స్పష్టమైన మినహాయింపు ఉంది. ఎప్పుడో జారీ అయినా ఈ జీవోలపై అధికారులకు అవగాహన కొరవడడం ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది.
జీవో 225 ఏం చెబుతోందంటే..!?
తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లేదా ఇతర ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలతో సంబంధం లేకుండా, 45 ఏళ్ల వయసు దాటిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మొదటి నియామకం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రమోషన్ కూడా పొందకపోతే, తదుపరి ఉన్నత పోస్టు ప్రమోషన్ పొందేందుకు డిపార్ట్‌మెంటల్ టెస్టుల ఉత్తీర్ణత నుండి జీవో 225 ద్వారా మూడు షరతులకు లోబడి శాశ్వత మినహాయింపు లభిస్తుంది. ఫస్ట్ షరతు ఏంటంటే, మొదటి ప్రమోషన్‌కు మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. ఇప్పటికే ఒకసారి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు లేని పోస్టులోకి ప్రమోషన్ పొంది ఉంటే, ఆపై పోస్టుకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు తప్పనిసరి అయితే ఈ మినహాయింపు వర్తించదు. అకడమిక్ అర్హతలకు మినహాయింపు వర్తించదనేది రెండవ నిబంధన. ఈ మినహాయింపు కేవలం డిపార్ట్‌మెంటల్ లేదా స్పెషల్ టెస్టులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రమోషన్ పోస్టుకు అవసరమైన సాంకేతిక లేదా అకాడమిక్ విద్యార్హతలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. అవి తప్పనిసరిగా ఉండాలి. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు వర్తించదనేది మూడో కండిషన్.
ఎస్ఏలకు గెజిటెడ్ హెచ్ఎం ప్రమోషన్లు!
విద్యాశాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా చేరి, 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఈ 225 జీవో ఒక సంజీవని లాంటిది. వీరికి అకడమిక్ విద్యార్హతలైన డిగ్రీ, బీఈడీ/పండిట్ ట్రైనింగ్/బీపీఈడీ మొదలైనవి ఉండి, డిపార్ట్‌మెంటల్ పరీక్షలు పాస్ కాకపోయినా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించాలని జీవో 225 నిర్దేశిస్తోంది. అదేవిధంగా, స్కూల్ అసిస్టెంట్‌గా నేరుగా నియామకమై, 45 ఏళ్ల వయసు దాటి 12 సంవత్సరాల సర్వీసు పూర్తి కాగానే 12 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేలును సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే మంజూరు చేయాలి.
మోడల్ స్కూల్ టీచర్లకూ వర్తింపు
ఈ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం వర్తిస్తాయి. మోడల్ స్కూళ్లల్లో పనిచేసే ప్రిన్సిపాల్స్, టీజీటీ, పీజీటీలకు 45 ఏళ్ల వయసు దాటి, ఒకే పోస్టులో 12 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే, డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఉత్తీర్ణతతో నిమిత్తం లేకుండా వారికి 12 సంవత్సరాల స్కేలును విధిగా మంజూరు చేయాలి. ప్రభుత్వ నిబంధనలు ఇంత స్పష్టంగా, పారదర్శకంగా ఉన్నా వాటిని అమలు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడం సమర్థనీయం కాదు. అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ వయోపరిమితి ఆధారంగా రావాల్సిన రెగ్యులర్ ప్రమోషన్లను, 12 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేల్‌ను అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా, ఒక హక్కుగా పోరాడి సాధించుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 225, 96లను అర్హులైన వారికి సత్వరం అమలు చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
-మానేటి ప్రతాపరెడ్డి,
రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, TRTF
98484 81028






