నాసిరకం భోజనం.. వర్షంలోనే ధర్నాకు దిగిన విద్యార్థులు

by Muthe.Rajitha |

తమకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసనకు దిగారు

నాసిరకం భోజనం.. వర్షంలోనే ధర్నాకు దిగిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : తమకు మెస్ లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా తామియా పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తమకు వడ్డిస్తున్న భోజనం అత్యంత నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా నాణ్యత లేని, అధ్వాన్నమైన ఆహారాన్ని వడ్డిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ వ్యవహారంపై పాఠశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తాము నిరసన బాట పట్టాల్సి వచ్చిందని వారు తెలిపారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగిన విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాఠశాల ప్రాంగణంలోనే ధర్నాకు బైఠాయించారు. తమ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, భోజనం నాణ్యతను మెరుగుపరచాలని, బాధ్యులైన ఉన్నతాధికారులు నేరుగా వచ్చి తమతో మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను విని, అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు తమ పోరాటాన్ని విరమించేదే లేదని, ఆందోళనను ఇలాగే కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

Next Story