- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో ఉచిత దర్శన టోకెన్ల జారీ రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే సామాన్య భక్తుల కోసం తిరుపతిలో రోజువారీగా జారీ చేసే ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల విషయంలో అధికారులు ముఖ్య ప్రకటన చేసారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో, రేపటి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఈరోజు కౌంటర్లలో భక్తులకు అందించాల్సిన ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని అధికారులు ఆకస్మికంగా రద్దు చేశారు. తిరుమలలో క్యూ కాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో రద్దీని క్రమబద్ధీకరించేందుకే ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే గురువారం జారీ చేసే టోకెన్లలో ఎలాంటి మార్పు ఉండదని, శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రేపు యథావిధిగా కొనసాగుతుందని వివరించారు.
అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టీటీడీ ఇలా ఆకస్మికంగా టోకెన్ల జారీని నిలిపివేయడం ఈ ఒక్క నెలలోనే ఇది నాలుగోసారి కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. టోకెన్ల కోసం కౌంటర్ల వద్దకు చేరుకున్న భక్తులకు రద్దు వార్త తెలియడంతో నిరాశతో వెనుతిరగాల్సి వస్తోంది. మరోవైపు తిరుమల మెట్ల మార్గంలో దివ్యదర్శనం కోసం జారీ చేసే టోకెన్ల విషయంలోనూ భక్తులకు కష్టాలు తప్పడం లేదు. మంగళవారం మెట్ల మార్గంలో టోకెన్ల జారీ ప్రారంభించిన కేవలం గంట వ్యవధిలోనే అవి పూర్తయిపోవడంతో వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఈ పరిస్థితులకు కారణమని అధికారులు వెల్లడించారు.
- Tags
- TTD
- SSD Tokens






