'నేను ఒక పోస్టుమ్యాన్!'.. ఆకాంక్ష గైక్వాడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం

by Yella Dhawani Reddy |

మహిళలు నేటి సమాజంలో ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటి, అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు.

నేను ఒక పోస్టుమ్యాన్!.. ఆకాంక్ష గైక్వాడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలు (Women's) నేటి సమాజంలో ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటి, అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. సైన్యం, రంగస్థలం, సాంకేతికత, వ్యాపారం, క్రీడలు.. ఏ రంగం అయినా మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి స్ఫూర్తిదాయక కథలలో ఆకాంక్ష గైక్వాడ్ (Akanksha Gaikwad) స్టోరీ కూడా ఒకటి. మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఇప్పుడు ఒక మహిళా పోస్టుమ్యాన్‌గా అద్భుతమైన పేరు తెచ్చుకుంది. సమాజంలో మహిళలపట్ల ఉన్న అభిప్రాయాలను సవాలు చేస్తూ, ధైర్యంగా, పట్టుదలతో ఎంతో మందికి ఓ కొత్త దిశను సృష్టించింది. 'పోస్టుమ్యాన్ (Postman) అంటే కేవలం మగవాళ్ల పని' అనే ఊహని ఆమె తక్కువ సమయంలోనే పూర్తిగా మార్చేసింది.

ఆకాంక్ష గైక్వాడ్ గణిత శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ఇండియన్ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని, దరఖాస్తు చేసుకోమని తండ్రి సలహా ఇవ్వడంతో అప్లై చేసింది. ప్రభుత్వ ఉద్యోగం రావటంతో ఆమెతో పాటు తల్లిదండ్రులు సైతం ఎంతో ఆనందపడ్డారు. అయితే, పోస్టుమ్యాన్‌ పోస్టుకు ఎంపికవ్వడంతో ఆకాంక్ష ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే.. అప్పటి వరకు ఆమె ఆఫీసు కూర్చుని చేసే డెస్క్ జాబ్‌నే ఊహించింది. కానీ, ఇంటింటికి తిరిగి ఉత్తరాలు అందించే పోస్టుమ్యాన్ ఉద్యోగం అని చెప్పటంతో షాక్‌కి లోనయింది. తల్లిదండ్రులు సైతం తమ కూతురు ఇంటింటికి తిరిగి ఉత్తరాలు ఇవ్వాలా? అని దిగులు చెందారు. అయితే, నెల రోజుల్లోనే వారి అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి.

ఉద్యోగంలో చేరిన తొలిరోజు 'ఈ కాలంలో ఎవరైనా ఉత్తరాలు రాస్తారా?' అనే అనేక అనుమానాలు ఆమె మదిలో మెదిలాయి. అయితే ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి ఉత్తరాలు ఇచ్చే అనుభూతి ఆమెకు మరో కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఈ ఉద్యోగం వల్ల ఆకాంక్ష ఎంతో మంది జీవితాలతో అనుబంధం ఏర్పరచుకుంది. ఒకసారి ఓ వృద్ధ మహిళ ఆమెను చూసి ఆశ్చర్యపడి, 'మహిళలు కూడా లెటర్లు ఇస్తారా?' అంటూ ఆప్యాయగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ ఘటన ఆకాంక్ష ఉద్యోగంపై ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపింది. మరో ఘటనలో ఓ చిన్నారి వచ్చి 'నేను కూడా మీలాగానే పోస్టుమ్యాన్ అవుతాను' అని చెప్పడంతో ఆమెకు ఉద్యోగంపై మరింత బాధ్యతను ఇష్టాన్ని పెంచింది.

ఆకాంక్ష పనిచేస్తోన్న ఆఫీసులో 26 మంది పోస్టుమ్యాన్‌లు ఉండగా.. అందులో తను ఒక్కతే మహిళ. మూడు సంవత్సరాల్లో ఆమె లక్షకు పైగా లెటర్లు పంపిణీ చేసింది. 'ప్రతి తలుపు తెరిచి ఆశగా లెటర్ తీసుకునే వారు చూపించే చిరునవ్వు నాకు జీవితం మీద ప్రేమను నేర్పింది' అని ఆమె అంటుంది. ఆమె తల్లిదండ్రులు కూడా తన ఉద్యోగం పట్ల గర్వపడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకాంక్ష స్టోరీ వైరల్‌గా మారింది.

Next Story