భార్య కోసం భర్త గొప్ప నిర్ణయం.. ఆ సమయంలో తోడుగా ఉండాలని రూ.1.2 కోట్ల జీతం ఇఛ్చే ఉద్యోగానికి రాజీనామా!

by Yella Dhawani Reddy |

హై పెయిడ్ సాలరీకి రిజైన్ చేశాడంటే పెద్ద కారణమే ఉందనుకుంటే పొరపాటే! ఎందుకంటే, భార్యకు తోడుగా ఉండేందుకు తను ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

భార్య కోసం భర్త గొప్ప నిర్ణయం.. ఆ సమయంలో తోడుగా ఉండాలని రూ.1.2 కోట్ల జీతం ఇఛ్చే ఉద్యోగానికి రాజీనామా!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించటమే పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగం దొరికినా, దాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఓ వ్యక్తి ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. హై పెయిడ్ సాలరీకి రిజైన్ చేశాడంటే పెద్ద కారణమే ఉందనుకుంటే పొరపాటే! ఎందుకంటే, భార్యకు తోడుగా ఉండేందుకు తను ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా! ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రెడ్డిట్ (Reddit) యూజర్ తాజాగా తన చివరి ఉద్యోగానికి సంబంధించి అనుభవాలను, రాజీనామాకు గల కారణాలను పంచుకున్నాడు. ఆ యూజర్ తన కాలేజీ డ్రాప్ అవుట్ అయ్యాక ఏడేళ్లకు కెరీర్‌లో మంచి స్థాయికి చేరినట్లు తెలిపాడు. బెంగళూరులోని జయనగర్‌లో నివాసముండే అతడికి రూ.1.2 కోట్ల జీతంతో వర్క్ ఫ్రం హోం సదుపాయం కలిగిన ఉద్యోగం ఉంది.

అయితే, ఇటీవల తన భార్య గర్భవతి అయింది. ఉద్యోగం నుంచి ఒక సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోమని ఆమెకు సూచించగా, ఆమె అందుకు నిరాకరించి పని గంటలు తగ్గించుకుంటానని చెప్పింది. దీంతో అతడే తన ఉద్యోగానికి రాజీనామా చేసి, భార్యకు పూర్తిగా మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇంటి పనులు, తోట పనులు, ఆమెను వాకింగ్‌కు తీసుకెళ్లడం, తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఈ ప్రత్యేక సమయంలో ఆనందంగా గడపాలనుకున్నట్లుగా చెప్పాడు. తన అనుభవంతో మళ్లీ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలను కానీ, ఈ క్షణాలను మిస్ చేసుకోకూడదంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, ఆర్థికంగా కూడా తాను ఈ నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతడికి మద్ధతు తెలుపుతుండగా, మరికొందరు అందరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండలేరంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story