హార్ట్ టచ్చింగ్ ఘటన.. భార్యను గోల్డ్ షాప్‌కి తీసుకెళ్లిన వృద్ధుడు.. డబ్బు లేకపోవడంతో ఏం చేశాడో చూడండి!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-19 14:52:57  IST  )

ఒక్కసారి మదిలో పుట్టిన ప్రేమ కడవరకు ఉంటుందని, ప్రేమకు వయసుతో సంబంధం లేదని వృద్ద దంపతులు రుజువు చేశారు.

హార్ట్ టచ్చింగ్ ఘటన.. భార్యను గోల్డ్ షాప్‌కి తీసుకెళ్లిన వృద్ధుడు.. డబ్బు లేకపోవడంతో ఏం చేశాడో చూడండి!
X

దిశ,వెబ్‌డెస్క్: ఒక్కసారి మదిలో పుట్టిన ప్రేమ కడవరకు ఉంటుందని, ప్రేమకు వయసుతో సంబంధం లేదని వృద్ద దంపతులు రుజువు చేశారు. కొన్ని బంధాలు, ప్రేమలు కాలంతో పాటు మరింత బలపడతాయనడానికి నిదర్శనంగా ఓ వృద్ధ జంట నిలిచింది. ఓ వృద్ధుడు తన భార్య కోరికను తీర్చడానికి చేసిన ప్రయత్నం అందరి హృదయాలను కదిలించేసింది. ఈ హార్ట్ టచ్చింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జాల్నా జిల్లా అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృతి షిండే (93), శాంతాబాయి (85) దంపతులకు వివాహమై 70 ఏళ్లు దాటింది. అయిన వారి ప్రేమ ఏమాత్రం చెక్కుచెదరలేదు. వయసుతో పాటు ప్రేమానురాగాలు సైతం పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు.

ఈ క్రమంలో శాంతాబాయి తన భర్త నివృతి షిండేతో తన కోరికను చెప్పుకుంది. తనకు కొత్త మంగళసూత్రం కావాలని ప్రేమగా అడిగింది. దీంతో భార్య కోరికను ఎలా అయిన తీర్చాలని ఆ వృద్ధుడు అనుకున్నాడు. ఈ క్రమంలో ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను వెంటబెట్టుకుని సమీపంలోని ఓ గోల్డ్ షాప్‌కి వెళ్లారు. ఈ తరుణంలో వారిద్దరిని చూసిన షాప్ యజమాని డబ్బుల కోసం వచ్చారమో అని అనుకున్నాడు.

ఈ క్రమంలో ఏం కావాలి తాతా అని అడుగగా.. తన భార్య మంగళ సూత్రం కావాలని అడిగిందని, కొనడానికి వచ్చానని నివృతి షిండే చెప్పారు. దీంతో అతను ఆశ్చర్యపోతాడు. ఆ వృద్ధుడి ప్రేమకు, వారి 70 ఏళ్లకు పైబడిన దాంపత్య బంధానికి చలించిపోయాడు. అయితే మంగళసూత్రం కొనగలిగే డబ్బు ఆ వృద్ధుని దగ్గర లేదు. ఇది గమనించిన షాప్ యజమాని మానవత్వంతో స్పందించాడు. వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న అతను కేవలం 20 రూపాయలు నామమాత్రంగా తీసుకుని వారికి మంగళసూత్రాన్ని ఇచ్చారు. దీంతో భార్య కళ్లలో ఆనందం చూసి ఆ వృద్ధుడు ఆనందభాష్పాలు రాల్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. వృద్ధాప్యంలోనూ ఒకరిపై ఒకరు చూపుతున్న ప్రేమనురాగాలు, షాప్ యజమాని ఉదారతకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Twitter Link

Next Story