- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రి చెక్‌అప్ రూంలో HD కెమెరాలు సెటప్.. రూ.499లకే మహిళల న్యూడ్ వీడియోల దందా
వైద్యం ముసుగులో కొన్ని ఆస్పత్రుల్లో వికృత దందా బట్టబయలైంది. చెకప్ రూమ్‌లలో హెచ్‌డీ సీక్రెట్ కెమెరాలు అమర్చి మహిళల న్యూడ్ వీడియోలను కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో అమ్మకానికి పెడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా సాంకేతికత శాపంగా మారుతోంది. ఒకప్పుడు ప్రాణాలు కాపాడే దేవాలయాలుగా భావించిన ఆసుపత్రులు, నేడు కొందరు కామాంధుల వికృత చేష్టలకు వేదికలవుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కిన అబలల ఆత్మగౌరవాన్ని బజారున పెడుతూ, ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం’ అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా నీచమైన దందాకు తెరలేపారు కొందరు కేటుగాళ్లు.
నమ్మకం ముసుగులో నయవంచన..
సాధారణంగా మహిళలు వివిధ ఆరోగ్య సమస్యల రీత్యా గైనకాలజీ లేదా ఇతర విభాగాలకు వెళ్తుంటారు. వ్యాధి నిర్ధారణలో భాగంగా ‘ఇంటర్నల్ చెకప్’ తప్పనిసరి. వైద్యులపై ఉన్న నమ్మకంతో రోగులు వారు చెప్పినట్లుగా దుస్తులు మార్చుకుని పరీక్షలకు సిద్ధమవుతారు. అయితే, ఈ నమ్మకాన్ని కొందరు ఆసుపత్రి సిబ్బంది, బయటి వ్యక్తులు కలిసి క్యాష్ చేసుకుంటున్నారు. చెకప్ రూమ్‌లలో ఎవరూ గుర్తించలేని విధంగా హై-డెఫినేషన్ (HD) సీక్రెట్ కెమెరాలను అమర్చి, మహిళల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డు చేస్తున్నారు.
రూ.499లకే ‘ప్రీమియం’ యాక్సెస్..
ఈ దందా ఎంత దారుణంగా తయారైందంటే.. రికార్డు చేసిన వీడియోలను క్లోజ్డ్ గ్రూపుల్లో బహిరంగంగా వేలం పెడుతున్నారు. తాజాగా ‘సక్షమ్ బీజీఎంఏ’ (Saksham Bgmi) అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ చేసిన పోస్ట్ నెటిజన్లను ఉలిక్కిపడేలా చేసింది. ‘కేవలం రూ. 499 చెల్లించి నా ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్‌లో చేరండి.. ఆసుపత్రి సీసీటీవీల్లో రికార్డైన హై క్వాలిటీ వీడియోలను వీక్షించండి’ అంటూ సదరు యూజర్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. కేవలం డబ్బు కోసం ఒక మహిళా రోగి వ్యక్తిగత గోప్యతను ఇంతలా దిగజార్చడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బహిరంగంగానే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నా, పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి గ్రూపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, వాటిని అరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వికృత దందాకు చెక్ పెట్టాలంటే కేవలం నిందితులనే కాకుండా, వారికి సహకరించిన ఆసుపత్రి యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ ‘సీసీటీవీ ఆడిట్’ నిర్వహించాలని, మహిళల గోప్యతకు భంగం కలిగించేలా కెమెరాలు ఉంటే భారీ జరిమానాలు విధించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చెకప్ రూమ్‌లలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.






