‘వినయ విధేయ రామ.. సిలిండర్‌తో రారా మామ’: గ్యాస్ కష్టాల్లోనూ తగ్గని మీమ్స్ జోరు

by Gantepaka Srikanth |

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపైనే చర్చ నడుస్తోంది.

‘వినయ విధేయ రామ.. సిలిండర్‌తో రారా మామ’: గ్యాస్ కష్టాల్లోనూ తగ్గని మీమ్స్ జోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపైనే చర్చ నడుస్తోంది. ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ కష్టాలను హాస్యంగా మలుస్తూ మీమ్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలను, వారి సినిమా సీన్లను గ్యాస్ సిలిండర్లతో ముడిపెడుతూ నెటిజన్లు చేస్తున్న ఎడిటింగ్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.

వైరల్ అవుతున్న క్రేజీ మీమ్స్..

సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో మీమర్స్ తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. పుష్ప-2 స్టైల్లో: "సిలిండర్ అంటే గ్యాస్ అనుకుంటివా.. ఫైర్!" అంటూ అల్లు అర్జున్ పోస్టర్లకు సిలిండర్‌ను తగిలించి చేస్తున్న పోస్టులు నవ్వులు పూయిస్తున్నాయి. మహేష్ బాబు 'శ్రీమంతుడు' సీన్‌లో సైకిల్ మీద పాలు తీసుకురావడానికి బదులు, గ్యాస్ సిలిండర్‌ను మోస్తున్నట్లు ఎడిట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ 'సలార్' కటౌట్‌లో కత్తులకు బదులు చేతిలో ఖాళీ సిలిండర్లు పట్టుకున్నట్లుగా ఉన్న ఎడిటింగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య డైలాగుల్లో "ఫ్లూటు బాబు దగ్గర ఊదు.. గ్యాస్ స్టవ్ దగ్గర కాదు", రామ్ చరన్ వినయ విధేయ రామ సినిమా పేరును.. వినయ విధేయ రామ.. గ్యాస్‌తో రారా మామ వంటి పేరడీ డైలాగులతో మీమ్స్ సందడి చేస్తున్నాయి.

భయం పోగొట్టేందుకే ఈ ప్రయత్నం?

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్, అధిక ధరలు మరియు కొరత వార్తలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు ఈ మీమ్స్ కొంత ఉపశమనాన్ని ఇస్తున్నాయి. "కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వుకోవడం మన భారతీయుల అలవాటు" అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం కావని, కొరత పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇప్పటికే అనంతపురం వంటి ప్రాంతాల్లో గ్యాస్ కొరతపై తప్పుడు వార్తలు పోస్ట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాబట్టి, మీమ్స్ చూసి సరదాగా నవ్వుకోవాలే తప్ప, వాటిని చూసి ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Next Story