China flying taxis: గాల్లో ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

by Yella Dhawani Reddy |

సాధారణంగా మనం బయటికి వెళ్లాలంటే బైకులు, కార్లు, ట్యాక్సీలు వినియోగిస్తుంటాం.

China flying taxis: గాల్లో ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మనం బయటికి వెళ్లాలంటే బైకులు, కార్లు, ట్యాక్సీలు వినియోగిస్తుంటాం. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు విపరీతమైన ట్రాఫిక్ సమస్య గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లయింగ్ ట్యాక్సీల దిశగా అనేక దిశలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఇందులో చైనా (China) కీలక ముందడుగు వేసింది. అంతేకాదు, ఏకంగా పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ ట్యాక్సీలను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇందుకు అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా(CAAC), ఈహాంగ్ హోల్డింగ్స్ (EHang Holdings), హెఫెయ్ హేయ్ ఎయిర్ లైన్స్ (HeYi Aviation) సంస్థలకు ప్యాసెంజర్లను తీసుకెళ్లే ఎయిర్ ట్యాక్సీలకు ( Flying taxis) అనుమతులిచ్చింది.

కాగా, చైనాలో ఏదైనా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. టైప్‌ సర్టిఫికెట్‌, ప్రొడక్షన్‌ సర్టిఫికెట్‌, ఎయిర్‌ వర్తీనెస్‌ సర్టిఫికెట్‌ వంటి అనుమతులు అనంతరం ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ క్రమంలో గ్వాంగ్‌జౌ, హెఫీ నగరాల మధ్య ఈ పర్యాటక ఎగిరే టాక్సీలను వినియోగించనున్నారు. ఇవి తక్కువ ఎత్తులో, సునాయాసంగా, పర్యాటకులకు గమ్య స్థానాలకు చేర్చుతాయి.

ఇక ప్రస్తుతం ఎగిరే ఈ ట్యాక్సీలు GPS, ఆటోనమస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. పైలట్ అవసరం లేకుండా, ఇవి ప్రీసెట్ మార్గాలపై అనువైన వేగంతో ఎగురతాయి. మనుషులు ఇవి నడపడం అవసరం లేకుండా, టెక్నాలజీ ద్వారా పూర్తిగా నియంత్రించబడతాయి. ఈ ప్రయాణం చాలా సులభం, సురక్షితంగా ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, 5G సిగ్నల్స్, అలర్ట్ సిస్టమ్స్ ద్వారా వీటిని పూర్తిగా ట్రాక్ చేయవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడంలో ఇది కూడా కీలక భూమిక పోషిస్తుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌ట్యాక్సీలకు సంబంధించి చైనా జర్నలిస్టు ఒకరు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, చైనాలో EHang సంస్థ 2017లో తన ప్రయోగాలను మొదలుపెట్టింది. 2020లో ఈ వాహనాలు మొదటిసారిగా గగనతలంలోకి వచ్చాయి. ఇప్పుడు EHang సంస్థ సివిల్ ఏవియేషన్ ద్వారా పరిపూర్ణ ధృవీకరణ పొందినందున, వీటిని ఇప్పుడు మరింత విస్తృతంగా ఉపయోగించడం సాధ్యం అవుతుంది.

Next Story