- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్త్రీల విషయంలో అందమైన ప్రశంసలు.. చివరికి జరిగేది ఇదే..!!
ఒక మహిళ గొప్ప ఆవిష్కరణ చేస్తే.. ‘బ్యూటిఫుల్ మైండ్’ అంటారు. అదే పురుషుడు చేస్తే.. ‘స్ట్రాంగ్ వారియర్ లేదా హీరో’ అంటారు.

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఒక విషయంలో పురుషుడు ధైర్యం ప్రదర్శిస్తే అతన్ని తెలివైనవాడు, ధైర్య వంతుడు అని పొగుడుతుంటారు మనలో చాలా మంది. అదే స్థానంలో మహిళ ధైర్యం ప్రదర్శిస్తే.. ఇక్కడ పొగడ్తలో కాస్త తేడా వచ్చేస్తుంది! ‘అందమైన ధైర్యం’ అనో లేదా ‘బ్యూటిఫుల్ ఇంటెలిజెన్స్’ అనో వర్ణిస్తుంటారు. ఇందులో తప్పేముంది? అని ఎవరికైనా అనిపిస్తుండవచ్చు. కానీ ఈ విధమైన పోలికలు, పొగడ్తలే మహిళల తెలివితేటలను, వారి నిజమైన సామర్థ్యాలను తక్కువ చేసి చూడటంలో, అణచివేయడంలో కీ రోల్ పోషిస్తున్నాయని ఫెమినిస్టుల వాదన.
ఆలోచనంతా ఆ కోణంలోనే..
స్త్రీల గుణ గణాలతోపాటు వారు చేసే ప్రతీ పనిని అందంతో ముడిపెట్టడమంటే అది మహిళల రియల్ టాలెంట్‌ను గుర్తించకపోవడం లేదా తక్కువ చేసి చూడటమే అంటున్నారు సామాజిక వేత్తలు. ఒకే అంశంలో లేదా ఒకే విషయంలో స్త్రీ, పురుషుల పనితీరును, ఫలితాలను, సామర్థ్యాన్ని భిన్నంగా చూడటమనేది పురుషాధిక్య భావజాలంలో భాగమేనని ఫెమినిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు ఒక మహిళ ఏదైనా ఒక క్రీడలో ధైర్యంగా పోరాడి గెలిచిందనుకోండి.. మీడియా లేదా మన సమాజంలో ఎక్కువమంది ఆమెను ‘అందమైన యోధురాలు’గానే భావిస్తారు తప్ప కేవలం ‘ధైర్యవంతురాలు’ అనే కోణంలో ఆలోచించేవారు, అంగీకరించేవారు. బయటకు చెప్పేవారు చాలా అరుదు. కారణం.. స్త్రీలంటే పురుషులకంటే తక్కువ అనే భావన తరతరాలుగా మనసుల్లో నాటుకుపోయి ఉంటుంది. పితృస్వామ్య భావజాలం చిన్నప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేసి ఉంటుంది. కాబట్టి అదే నిజమని అనుకుంటారు చాలా మంది స్త్రీ, పురుషులు.
‘బ్యూటిఫుల్ మైండ్’ వద్దు
సైంటిస్ట్ అయిన ఒక మహిళ గొప్ప ఆవిష్కరణ చేసిందనుకోండి.. ‘బ్యూటిఫుల్ మైండ్’ అంటారు. అదే పురుషుడి విషయానికి వస్తే.. ‘ధైర్యవంతుడు లేదా స్ట్రాంగ్ వారియర్ లేదా హీరో అని పిలుస్తుంటారు. అలాగే పురుష సైనికులను ‘బ్రేవ్ సోల్జర్’ అని ప్రశంసిస్తారు. కానీ అదే ప్లేస్‌లో మహిళ ఉంటే మాత్రం ‘బ్యూటిఫుల్ వారియర్’ అంటారు. ఇక పరిశోధనా రంగంలో కూడా స్త్రీలను ‘కంట్రోలింగ్’ లేదా ‘డిఫికల్ట్’ అని పిలుస్తుంటారు. పురుషులను మాత్రం ‘స్ట్రాంగ్ లీడర్’ అంటారు. అంటే ఇక్కడ స్త్రీలను అందం, అణకువతో ముడిపెట్టి చూడటం, పిలవడం వల్ల వారి ధైర్యం, సామర్థ్యం, నైపుణ్యం సెకండరీ అవుతాయి.
ఏం చేయాలి?
స్త్రీలను ప్రతీ విషయంలో అందంతో ముడిపెట్టి పరిగణించడమనేది నిజానికి లింగ పక్షపతానికి (జెండర్ బయాస్) దారితీస్తున్నదని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా అందమైన పొగడ్తలు అనేక సందర్భాల్లో మహిళల అసలైన, నిజమైన సామర్థ్యానికి ఎసరు పెడుతున్నాయని స్త్రీ వాదులు అంటున్నారు. అంతేకాదు మహిళల విషయంలో వాడే భాష, చూసే కోణం, ప్రశంసించే తీరులో కూడా మార్పు రావాలని, అవి వారి సామర్థ్యాన్ని, సమానత్వాన్ని డిస్టర్బ్ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు. అంటే నిజమైన విజయాలను కేవలం వారి అందంతో, నాజూకు తనంతో ముడిపెట్టి చూడకుండా.. సామర్థ్యం, ధైర్యం, నైపుణ్యాలు వంటివే ప్రయారిటీ అంశాలుగా పరిగణించాలని సామాజిక వేత్తలు, ముఖ్యంగా స్త్రీ వాదులు అంటున్నారు. ప్రశంసల్లో, ప్రస్తావనల్లోనూ అదే జరగాలని, అప్పుడే పురుషాధిక్య భావన తగ్గి, సమానత్వ భావన ఏర్పడుతుందని చెబుతున్నారు.






