- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీమా లేదు.. ఫిట్ నెస్ ఉండదు
పురపాలక సంఘంలోని వాహనాల నిర్వహణ దారి తప్పింది. పారిశుద్ధ్య విభాగంలో ఏడు వాహనాలు ఉన్నాయి.

దిశ, ఆమనగల్లు : పురపాలక సంఘంలోని వాహనాల నిర్వహణ దారి తప్పింది. పారిశుద్ధ్య విభాగంలో ఏడు వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి మరమ్మతుకు గురైంది. వీటి నిర్వహణకు పూర్తిస్థాయిలో వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. పురపాలక సంఘంలో ఏడు వాహనాలకు బీమా ఫిట్ నెస్ ఏటేటా చేయించడం లేదు. డ్రైవర్ పోస్టులు లేకపోవడంతో వాహనాలను పారిశుద్ధ్య కార్మికులు, లైసెన్స్ లేని వారు, డ్రైవింగ్ నేర్చుకునేందుకు కొందరు నడిపిస్తున్నారు. వీరి నిర్వాకంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొందరు పట్టపగలే మద్యం తాగి వాహనాలు తిప్పుతున్నారు. ఫలితంగా పర్యవేక్షణ కొరవడి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పురపాలక సంఘంలోని వాహనాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో మరమ్మత్తులు, నిర్వహణ పేరిట భారీగా నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పారిశుద్ధ్య విభాగంలో ఏడు చెత్త సేకరణ వాహనాలు, రెండు ట్రాక్టర్లు, వైకుంఠ రథం వాహనాలు ఉన్నాయి. ఆయా వాహనాల రికార్డుల నిర్వహణ, రోడ్ టాక్స్, సర్వీసింగ్, బీమ, ఫిట్ నెస్ గడువులోపే చేయించాల్సి ఉంటుంది. ఆయా ప్రక్రియలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బీమా లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన పక్షంలో ఇరుపక్షాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. వాహనాలకు జియో ట్యాగింగ్ లేకపోవడంతో ఇంధన వినియోగం శాస్త్రీయంగా జరగడం లేదు. వాహనాలకు అవసరమైన చిన్నచిన్న మరమ్మతులు కార్మికులే చేపడుతున్నప్పటికీ ఈ విభాగం అధికారులు బిల్లులు సమర్పించి డబ్బులు కాజేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డిని వివరణ కోరగా అన్ని వాహనాల నిర్వహణకు నిబంధనలు పాటిస్తున్నామని, వాహనాలకు బీమా చేయిస్తామని తెలిపారు.






