అట్టుడుకుతోన్న ఢిల్లీ.. వరుసగా గళం విప్పుతున్న బాలీవుడ్ హీరోయిన్లు

by Ramesh Naini |

నీట్ (NEET) పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చు‌క్‌కు బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన పూర్తి మద్దతు ప్రకటించారు.

అట్టుడుకుతోన్న ఢిల్లీ.. వరుసగా గళం విప్పుతున్న బాలీవుడ్ హీరోయిన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET) పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చు‌క్‌కు బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన పూర్తి మద్దతు ప్రకటించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో గత 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్‌తో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా స్పందించిన ప్రీతి జింటా.. ‘వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకముందే ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో అర్థవంతమైన చర్చలు ప్రారంభించాలి. దయచేసి మీ దీక్షను విరమించండి, మీ పోరాటం ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం’ అని విజ్ఞప్తి చేశారు. భారతదేశ భవిష్యత్తు కోసం, యువత కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థికి తన అండ ఉంటుందని స్పష్టం చేశారు.

సినీ ప్రముఖుల నుంచి మద్దతు

సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున CJP చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి పలువురిని అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ అక్రమాలపై పారదర్శక విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖులు స్వయంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొనగా.. సోనాక్షి సిన్హా, సోనూ సూద్, అదితి రావ్ హైదరీ, భూమి పెడ్నేకర్, దియా మీర్జా, వీర్ దాస్, టోవినో థామస్ తదితరులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

Next Story