దిశ కథనానికి స్పందన..!

by Ratna Kumari |

చివ్వేంల మండల కేంద్రంలోని మినీ గురుకుల (ఎస్టీ బాలికల) పాఠశాలలో అకౌంటెంట్ పోస్టు భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధితురాలు బానోత్ యశోద పాఠశాల ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు.

దిశ కథనానికి స్పందన..!
X

దిశ, చివ్వేంల : చివ్వేంల మండల కేంద్రంలోని మినీ గురుకుల (ఎస్టీ బాలికల) పాఠశాలలో అకౌంటెంట్ పోస్టు భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధితురాలు బానోత్ యశోద సోమవారం పాఠశాల ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకౌంటెంట్ పోస్టుకు సంబంధించి 2026 మే 27న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మాసాబ్ ట్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి తన పేరుతో నల్గొండ ప్రాంతీయ సమన్వయ కార్యాలయానికి (ఆర్‌సీఓ) మెమో పంపినట్లు తెలిపారు. అయితే తనకు జాయినింగ్ లెటర్ ఇవ్వకుండా ఆర్‌సీఓ అధికారులు కాలయాపన చేశారని ఆరోపించారు. తన పేరుతో వచ్చిన మెమోను అక్రమంగా మార్చి, జూలై 2న సాయి ప్రత్యూష అనే మహిళకు నియామక ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఆర్‌సీఓను కలిసినా తనకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిబంధనలకు విరుద్ధంగా స్థానికురాలైన తనకు రావాల్సిన ఉద్యోగాన్ని స్థానికేతర మహిళకు కేటాయించారని యశోద ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై దిశలో కథనం ప్రచురితమైన అనంతరం, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అకౌంటెంట్ సాయి ప్రత్యూషను నాలుగు రోజుల పాటు విధులకు హాజరు కాకూడదని మౌఖికంగా తెలియజేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారని సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకం జరిగి ఉంటే, వార్త ప్రచురితమైన వెంటనే విధుల్లో ఉన్న ఉద్యోగిని నాలుగు రోజుల పాటు విధులకు రాకుండా ఎందుకు నిలిపివేశారనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి బాధితురాలికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Next Story