ప్రెస్ ఫ్రీడమ్‌పై మోడీని నిలదీసిన లేడీ జర్నలిస్టు.. విదేశాంగ శాఖ Vs నార్వే పత్రిక!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-19 17:46:54  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ నార్వే పర్యటనలో పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించిన నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్ హెల్లే లింగ్ స్వెండ్సెన్ అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారారు.

ప్రెస్ ఫ్రీడమ్‌పై మోడీని నిలదీసిన లేడీ జర్నలిస్టు.. విదేశాంగ శాఖ Vs నార్వే పత్రిక!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నార్వే పర్యటనలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం భారత్‌తో పాటు అంతర్జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఓస్లోలో నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి ప్రధాని మోదీ సంయుక్తంగా ప్రెస్‌మీట్ ముగించుకుని వెళ్తుండగా.. ఓ నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ జర్నలిస్ట్ పేరే హెల్లే లింగ్ స్వెండ్సెన్ (Helle Lyng Svendsen). ప్రస్తుతం ఈమె పేరు రెండు దేశాల రాజకీయాల్లోనూ పెద్ద దుమారమే రేపుతోంది.

వైరల్ అయిన ఆ ప్రశ్న ఏంటి?

ఓస్లో-ఆధారిత ప్రసిద్ధ పత్రిక ‘దగ్సావిసెన్’ (Dagsavisen)‌లో పొలిటికల్ కామెంటేటర్, జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న హెల్లే లింగ్.. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసి ప్రధాని మోడీ వేదిక దిగి వెళ్తుండగా గట్టిగా అరుస్తూ.. ‘ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుంచి మీరు కొన్ని ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు’ అంటూ ప్రశ్నించారు. కానీ అప్పటికే ఇద్దరు ప్రధానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన జర్నలిస్ట్ హెల్లే లింగ్ ప్రధాని మోడీని ప్రశ్నించిన వీడియోను ఆమె తన ‘X’‌లో పోస్ట్ చేస్తూ.. ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌’లో నార్వే మొదటి స్థానంలో ఉంటే, భారత్ 157వ స్థానంలో ఉంది. ప్రజాస్వామ్య సమాజంలో పాలకులను ప్రశ్నించడమే జర్నలిస్టుల విధి అని రాసుకొచ్చారు.

విదేశాంగ శాఖతో వాడివేడి చర్చ..

అయితే, ఈ పంచాయితీకి ఎండ్ కార్డు పడలేదు. విషయం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహించిన అధికారిక మీడియా బ్రీఫింగ్‌కు కూడా చేరింది. అక్కడ జర్నలిస్ట్ హెల్లే లింగ్ భారత అధికారులను ఉద్దేశించి.. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, పత్రికా స్వేచ్ఛ ఆంక్షలతో అంతర్జాతీయ సమాజం మిమ్మల్ని ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. అందుకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్‌కు 5 వేల ఏళ్ల నాగరికత ఉందని, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ విలువలు తెలియకుండా గుడ్డిగా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను పట్టుకుని విమర్శించడం సరికాదని సమాధానం ఇచ్చారు.

ఐ యాయ్ నాట్ ఏ ‘స్పై’.. ట్రోలింగ్‌పై జర్నలిస్ట్ రియాక్షన్ ఇదే!

ప్రధాని మోడీని ప్రశ్నించిన అనంతరం జర్నలిస్ట్ హెల్లే లింగ్‌పై సోషల్ మీడియాలో భారత నెటిజన్లు, బీజేపీ మద్దతుదారులు, ఇతరులు ఆమెపై ముప్పేట ట్రోలింగ్‌కు దిగారు. హెల్లే లింగ్ చైనా ఏజెంట్ అని, భారత్‌ను అబాసుపాలు చేయడానికి అపాయింట్ చేసిన ఓ విదేశీ ‘స్పై’ అని ఆరోపణలు గుప్పించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ‘నేను ఎలాంటి విదేశీ ప్రభుత్వానికి సంబంధించిన ‘స్పై’ కాను. నా వృత్తి జర్నలిజం మాత్రమే’ అని క్లారిటీ ఇచ్చారు. ఈ దెబ్బతో ఆమె అంతకుముందు కేవలం 800 మంది ఫాలోవర్లను మాత్రమే కలిగి ఉండగా.. ఈ ఒక్క కామెంట్‌తో ఆమె ఫాలోవర్ల సంఖ్య 17 వేలు దాటడం విశేషం.

Next Story