దండాలయ్యా.. నాన్నంటే నువ్వేనయ్యా.. ఫిదా అవుతున్న నెటిజన్స్

by Muthe.Rajitha |

అతను ఒక చిన్న రైతు. ఏడాది మొత్తం కష్టపడితే తిండి గింజలు మాత్రమే సంపాదించగలడు.

దండాలయ్యా.. నాన్నంటే నువ్వేనయ్యా.. ఫిదా అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అతను ఒక చిన్న రైతు. ఏడాది మొత్తం కష్టపడితే తిండి గింజలు మాత్రమే సంపాదించగలడు. కాలం పగబట్టి పంటలు నాశనం అయితే అవి కూడా ఉండవు. అయితే తన కూతురు అంటే విపరీతమైన ప్రేమ. కూతురు ఓసారి ఏదో సందర్భంలో తనకు స్కూటీ కావాలని అడిగితే.. అందుకు ఆ తండ్రి చేసిన పనికి నెటిజన్స్ అంతా సలామ్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాకు చెందిన బజరంగ్ రామ్ అనే రైతు తన కూతురు చంపా భగత్ తనకు స్కూటర్ కావాలని కోరింది. అది కొనాలంటే లక్ష రూపాయలు కావాలని, తన దగ్గర అంత డబ్బు లేకపోయినా ఆమె కోరికను నెరవేర్చాలని బజరంగ్ నిశ్చయించుకున్నాడు.

అప్పటి నుంచి రోజూ తన సంపాదనలో కొన్ని నాణేలను ఒక బ్యాగ్‌లో దాచడం ప్రారంభించాడు. ఆరు నెలల పాటు సేకరించిన ఆ నాణేలతో దీపావళి రోజున కూతురుకి సప్రైజ్ ఇచ్చేందుకు జశ్‌పుర్‌లోని షోరూమ్‌కు వెళ్లి, స్కూటర్ కొనాలని సిబ్బందికి చెప్పాడు. అతని వద్ద ఉన్న నాణేల మూట చూసి షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. షోరూమ్ డైరెక్టర్ ఆనంద్ గుప్తా ఈ తండ్రీకూతురు కథ విని, నాణేలను లెక్కించమని సూచించాడు. ఆ కుటుంబాన్ని అతిథి మర్యాదలతో సత్కరించారు. ఆ నాణేలు లెక్కించగా రూ.40 వేలు వచ్చాయి.

మిగతా మొత్తానికి బజరంగ్ లోన్ తీసుకుంటాననడంతో, సిబ్బంది ఆ ప్రక్రియ పూర్తి చేసి, హోండా యాక్టివా స్కూటర్ తాళం చెవిని చంపాకు అందజేశారు. దానిని తీసుకున్న చంపా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని చెప్పింది. ఈ సందర్భంగా షోరూమ్ వారు ఒక గిఫ్ట్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దండాలయ్యా.. నాన్నంటే నువ్వేనయ్యా అని పొగుడుతున్నారు.

Next Story