మేడారం జాతరలో ఫేమస్ అయిన లేడీ IPS ఆఫీసర్‌కు గాయం! వీడియో వైరల్

by Ramesh Naini |

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఈ సారి ఒక ఐపీఎస్ అధికారిణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

మేడారం జాతరలో ఫేమస్ అయిన లేడీ IPS ఆఫీసర్‌కు గాయం! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఈ సారి ఒక ఐపీఎస్ అధికారిణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. జాతరలో అధికారులు, మహిళలతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఏసీపీ వసుంధర యాదవ్ దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో గాయపడ్డారు. ఆమె కాలికి తీవ్ర గాయమైనప్పటికీ, నొప్పిని భరిస్తూనే డ్యూటీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జాతరలో రద్దీని నియంత్రిస్తూ విధుల్లో నిమగ్నమైన వసుంధర యాదవ్‌కు, కొందరు ఆకతాయిలు బాధ్యతారాహిత్యంగా పారేసిన బీరు బాటిల్ ముక్కలు కాలికి గుచ్చుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమె కాలి బొటనవేలికి తీవ్ర గాయమై రక్తం కారింది. జాతరలో భక్తుల భద్రతే ధ్యేయంగా పని చేస్తున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురైంది.

నొప్పిని సైతం లెక్కచేయని నిబద్ధత..

సాధారణంగా ఇలాంటి గాయాలైనప్పుడు ఎవరైనా విశ్రాంతి తీసుకుంటారు. కానీ, వసుంధర యాదవ్ తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. రక్తం కారుతున్నా సరే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకుని తిరిగి విధుల్లో చేరారు. ‘జాతర ముగిసే వరకు భక్తులకు ఇబ్బంది కలగకూడదు’ అనే లక్ష్యంతో ఆమె చూపిన అంకితభావానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

నెట్టింట 'సెల్యూట్'ల వర్షం

కొద్దిరోజుల క్రితమే మేడారం జాతరలో అధికారులు, మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆమె వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. అప్పట్లో ఆమె చురుకుదనాన్ని మెచ్చుకున్న నెటిజన్లు, ఇప్పుడు ఆమె వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధతకు 'సెల్యూట్' చేస్తున్నారు. ‘బాధ్యత అంటే ఇది.. అందం, డ్యాన్స్‌తోనే కాదు, తన పనితీరుతోనూ వసుంధర యాదవ్ అందరికీ ఆదర్శంగా నిలిచారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Next Story