ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా.. ఆ తాడు ప్రత్యేకత ఏంటో తెలుసా?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-15 06:59:42  IST  )

ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారనే విషయం తెలిసిందే.

ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా.. ఆ తాడు ప్రత్యేకత ఏంటో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారనే విషయం తెలిసిందే. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నేడు(ఆగస్టు 15,2025) 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘2047 వికసిత భారత్‌ విజన్​తో, నయా భారత్’​ థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. 1947లో మొదటి స్వాతంత్య్ర వేడుకల్లో భారత మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్ పైన మువ్వన్నెల జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15న దేశ ప్రధానమంత్రి ఎర్రకోట లాహోరీ గేట్ వద్ద జెండాను ఎగురవేస్తారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురుతున్న ఆ మువ్వన్నెల జెండాకు ఆధారమైన తాడుకు ఓ ప్రత్యేకత ఉంది.

అది ఏంటంటే.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఉపయోగించే తాడు వెనుక ఆసక్తికరమైన విశేషముంది. ఆ తాడును తయారు చేసే దుకాణం నిర్వహకుడు నరేష్ జైన్ కీలక విషయాలు వెల్లడించారు. జెండాను ఎగుర వేయడానికి ఉపయోగించే తాడు మన్నికైనదిగా ఉంటుంది. అది జెండాను గాలిలో ఎగురవేయడానికి, నిలబెట్టడానికి ఆధారంగా ఉంటుంది. ఈ క్రమంలో ‘‘జెండా ఆవిష్కరణకు ఉచితంగా తాళ్లను అందజేస్తున్నాం. స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు నెలల ముందు తాళ్లు తయారు చేస్తాం. ఏటా ఆగస్టు 15 కి పక్షం రోజుల ముందు ఆర్మీ అధికారులు వచ్చి వాటిని తీసుకుంటారు. తాళ్లను అందించినందుకు సైన్యం ప్రశంస పత్రాన్ని ఇస్తుంది’’ అని నరేష్ జైన్ తెలిపారు.

Next Story