Sri Krishnadevaraya's tomb: శ్రీకృష్ణదేవరాయల సమాధిపై పాడుపని.. నెట్టింట వీడియో వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-22 12:01:23  IST  )

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీశృష్ణదేవరాయలు (Sri Krishnadevaraya) చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు.

Sri Krishnadevarayas tomb: శ్రీకృష్ణదేవరాయల సమాధిపై పాడుపని.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీశృష్ణదేవరాయలు (Sri Krishnadevaraya) చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని హంపి (Hampi) రాజధానిగా ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయారు. ఇక ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత హంపీ, ఆనెగుంది ప్రాంతాల నడుమ తుంగభద్ర నదీ తీరంలో సమాధి నిర్మించారు. 64 స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన రాయల సమాధిని పురావస్తుశాఖ వారు సంరక్షిత స్మారకంగా ప్రకటించారు. ఈ 64 పిల్లర్లు చదరంగంలోని 64 పావులకు గుర్తులు. జీవితం అనే చదరంగంలో అందరం పావులమే అన్న ఉద్దేశ్యంతో ఆయన సమాధిని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. అయితే, తాజాగా కొంతమంది ఆయన సమాధిపై ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కొంత మంది దుర్మార్గులు శ్రీకృష్ణదేవరాయల సమాధిపై పొట్టేలు గొంతుకోసి, కళేబరాన్ని స్తంభానికి కట్టి చర్మం వలిచారు. ఓ వ్యక్తి దాన్నంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, నెట్టింట షేర్ చేయగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చరిత్రకారులు, కన్నడ పర సంఘటనల కార్యకర్తలు ఘటనను ఖండిస్తూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సమాధిపై మేకను కోసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత అవమానకరమైన విషయమని, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, పురావస్తు శాఖ హిందూ దేవాలయాలను కూల్చిన ఔరంగజేబు సమాధిని రక్షిస్తోందని, విజయనగర సామ్రాజ్యం కీర్తి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన శ్రీ కృష్ణ దేవరాయల సమాధిని మాత్రం పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు.

అయితే, ఆనెగుంది చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఏవైనా పండగలు, జాతరలు వస్తే మరుసటి రోజు ఇలా సమాధిపైన జంతువధ చేయడం పరిపాటిగా మారింది. ఆదివారం ఆనెగుందిలో జాతర జరిగింది. మరుసటి రోజు స్థానికులెవరో రాయల సమాధిపైన ఈ కృత్యానికి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే పురావస్తు, పోలీస్‌ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story