ఏసీ కోచ్‌లో దీపారాధన.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం! వీడియో వైరల్

by Ramesh Naini |

కదులుతున్న రైలులోని ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు నూనె దీపం, అగరబత్తులు వెలిగించి పూజలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

ఏసీ కోచ్‌లో దీపారాధన.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కదులుతున్న రైలులోని ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు నూనె దీపం వెలిగించి పూజలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అప్పర్ బెర్త్‌పై కూర్చున్న సదరు వ్యక్తి బహిరంగంగా మంట వెలిగించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనను గమనించిన తోటి ప్రయాణికుడు పూజ చేస్తున్న వ్యక్తిని వారించారు. ఏసీ కోచ్‌లో పొగ వల్ల ఫైర్ అలారం మోగే అవకాశం ఉందని, కదులుతున్న రైలులో ఇలా మంట వెలిగించడం వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించే ముప్పు ఉందని హెచ్చరించారు. అందరి భద్రత దృష్ట్యా వెంటనే మంటను ఆర్పేయాలని కోరారు.

నెటిజన్ల ఆగ్రహం..

ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. వ్యక్తిగత మత విశ్వాసాల పేరుతో వందలాది మంది ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడం దారుణమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన సదరు వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రైల్వే శాఖ స్పందన..

సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులపై ‘రైల్వే సేవా’ (Railway Seva) స్పందించింది. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా.. సంబంధిత పీఎన్ఆర్ (PNR), రైలు నెంబర్ వివరాలు అందించాలని కోరింది. మతవిశ్వాసాలు ఏవైనప్పటికీ, బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో తోటి ప్రయాణికుల భద్రతకే ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Next Story