ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి కార్యాలయాల ఏర్పాటుకు స్థల పరిశీలన

by Taduka Kalyani |

ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి కార్యాలయాల ఏర్పాటుకు స్థల పరిశీలన
X

దిశ, వంగూర్ : మండల ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఖాళీగా ఉన్న సుమారు ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని సోమవారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలం విస్తీర్ణం, సరిహద్దులు, ప్రభుత్వ భూమి అందుబాటు, భవిష్యత్ విస్తరణ అవకాశాలు, రాకపోకలకు అనువైన మార్గాలు, మౌలిక వసతుల కల్పనకు ఉన్న సౌకర్యాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి కార్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లు, విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతులు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికలను సిద్ధం చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నివేదికలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల ఏర్పాటు వల్ల వివిధ శాఖల కార్యాలయాల కోసం ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా కావడంతో పాటు పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని కలెక్టర్ తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రజా పరిపాలనను మరింత చేరువ చేసేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండడం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగవంతంగా, సులభంగా అందుతాయని చెప్పారు. మండలంలో ఇందుకు అనువైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం సంతోషకరమని, అవసరమైన ప్రతిపాదనలను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కెవిఎన్ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మురళీమోహన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, రెవెన్యూ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story