రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. కేసులు నమోదు

by Kodari Anjali |

సూర్యాపేట జిల్లాలో రెండు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. కేసులు నమోదు
X

దిశ, సూర్యాపేట: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పీ ఆధ్వర్యంలో, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, నల్గొండ జిల్లా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సంయుక్తంగా సోమవారం సూర్యాపేట జిల్లాలోని పలు రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వానికి సంబంధించిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో భారీ అవకతవకలు, ధాన్యం లోటు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడంతో రెండు రైస్ మిల్లుల యాజమాన్యాలపై అత్యావశ్యక వస్తువుల చట్టం–1955 ప్రకారం సెక్షన్ 6-ఏ కింద కేసులు నమోదు చేశారు.పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలోని జేపీ రైస్ మిలుల్లో విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లు యాజమాన్యం సరఫరా చేయలేదని గుర్తించారు. భౌతిక తనిఖీల్లో ప్రభుత్వానికి సంబంధించిన 4,886.50 మెట్రిక్ టన్నుల ధాన్యం లోటు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.11.67 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతో సంబంధిత మిల్లు యాజమాన్యంపై అత్యావశ్యక వస్తువుల చట్టం ప్రకారం సెక్షన్ 6-ఏ కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత మిల్లులపై...

సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామంలోని ఎస్‌వీఆర్‌ఐ రైస్ మిల్లో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మిల్లులో ఆక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో అధికారులు రికార్డులను పరిశీలించి భౌతిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ప్రభుత్వానికి సంబంధించిన 11,400.843 మెట్రిక్ టన్నుల ధాన్యం లోటు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారురూ.27.23 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ మిల్లు యాజమాన్యంపై సెక్షన్ 6-ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు రైస్ మిల్లుల వ్యవహారాల్లో తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత మిల్లులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌కు విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం నిల్వలు, బియ్యం నిల్వలు, కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సీఎంఆర్ సరఫరా ప్రక్రియలో పారదర్శకత కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు జిల్లాలో కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ ఆకస్మిక తనిఖీల్లో నల్గొండ జిల్లా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పీ ఆధ్వర్యంలోని అధికారులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు ప్రదీప్ రెడ్డి, రాజశేఖర్, విజిలెన్స్ సిబ్బంది, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story